నేను కాదు, నాలానే ఉన్న మరో వ్యక్తి.. రేవ్ పార్టీపై హీరో శ్రీకాంత్
రేవ్ పార్టీలో పట్టుబడిన వారి వివరాలను బెంగళూరు పోలీసులు ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదు. కానీ, నటి హేమకు మాత్రం షాకిచ్చారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పట్టుబడిన వారిలో పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖంగా నటి హేమ, హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్, యాంకర్ శ్యామల అంటూ సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ప్రచారం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు సైతం ఈ పేర్లను ప్రసారం చేశాయి.
అయితే తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా స్పందించారు హీరో శ్రీకాంత్. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఓ వీడియో విడుదల చేశారు. రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని తాను కాదన్నారు. తప్పుడు కథనాలను నమ్మొద్దని సూచించారు. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి ఎవరో.. కొంచెం తనలానే ఉన్నాడన్నారు శ్రీకాంత్. అతడికి కాస్త గడ్డం ఉందని.. ముఖం కవర్ చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఆ విజువల్స్ చూసి తానే షాకయ్యానన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్.
మరోవైపు రేవ్ పార్టీలో పట్టుబడిన వారి వివరాలను బెంగళూరు పోలీసులు ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదు. కానీ, నటి హేమకు మాత్రం షాకిచ్చారు. తాను రేవ్ పార్టీలో లేనంటూ హేమ విడుదల చేసిన వీడియోకు కౌంటర్‌గా ఆమె ఫొటో రిలీజ్ చేశారు బెంగళూరు పోలీసులు. హేమ విడుదల చేసిన వీడియో కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌లో రికార్డు చేసిందే అంటూ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.