Telugu Global
Telangana

ఎవ్వర్నీ వదిలిపెట్టని బీజేపీ.. ఇప్పుడు ప్రభాస్ ని కూడా..

ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన రాముడి పాత్రలో కనిపిస్తారు. ఈ సెంటిమెంట్ ని అడ్డు పెట్టుకుని ప్రభాస్ ని రామ్ లీలాకు ఆహ్వానించేలా చేశారు బీజేపీ నేతలు.

ఎవ్వర్నీ వదిలిపెట్టని బీజేపీ.. ఇప్పుడు ప్రభాస్ ని కూడా..
X

బీజేపీకి సినీతారల పిచ్చి బాగా పట్టుకుంది. అందులోనూ దక్షిణాది తారలు, ప్రత్యేకంగా తెలుగు సినిమా హీరోలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఊరకనే హీరోలని పిలిచి టీ, కాఫీ తాగి, భోజనం చేసి ఫొటో దిగి పంపించడానికి బీజేపీ నేతలు అమాయకులేం కాదు. కచ్చితంగా రాజకీయ‌ ప్రయోజనం కోసమే వారు ఈ భేటీలు సెట్ చేస్తున్నారు. తాజాగా హీరో ప్రభాస్ కి ఆహ్వానం పంపించారు. నేరుగా బీజేపీనుంచి కాకుండా ఢిల్లీ రామ్ లీలా ట్రస్ట్ నుంచి ఈ ఆహ్వానం వెళ్లింది.

దసరా ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే రావణాసుర దహన కార్యక్రమానికి ప్రతి ఏటా ప్రధాన మంత్రి, ఇతర మంత్రులు వెళ్లడం ఆనవాయితీ. ఇతర సెలబ్రిటీలు, సినీ తారలకు కూడా ఆహ్వానాలు ఉంటాయి. ఈసారి ఆ ఆహ్వానం తెలుగు హీరో ప్రభాస్ కి వచ్చింది. దక్షిణాది నుంచి ఈ ఆహ్వానం అందుకున్న తొలి నటుడు ప్రభాస్ కావడం విశేషం. ప్రభాస్ వెళ్తే ఈ వేదికపై ప్రధాని నరేంద్రమోదీతో స్టేజ్ పంచుకోవాల్సి ఉంటుంది. రావణాసురుడిపై ప్రభాస్ తో కలిసి మోదీ బాణాన్ని ఎక్కుపెడతారు. ఆ తర్వాత ఆ ఫొటోతో సోషల్ మీడియా ఓ రేంజ్ లో హడావిడి చేస్తుంది బీజేపీ. ఇదీ జరగబోయే సీన్.

ప్రభాసే ఎందుకు..?

ఇటీవల హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జేపీ నడ్డా, హీరో నితిన్ ని కలిశారు. అంతకు ముందు ఏపీలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణకోసం ప్రత్యేకంగా చిరంజీవికి ఆహ్వానం పంపించారు మోదీ. వరుసగా సినీ తారల్ని ఆకర్షిస్తున్న బీజేపీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని లైన్లో పెట్టాలనుకుంటోంది. దీనికి రామ్ లీలా లో జరిగే రావణ దహనాన్ని వేదిక చేసుకోవాలనుకుంటున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన రాముడి పాత్రలో కనిపిస్తారు. ఈ సెంటిమెంట్ ని అడ్డు పెట్టుకుని ప్రభాస్ ని రామ్ లీలాకు ఆహ్వానించేలా చేశారు బీజేపీ నేతలు. ప్రభాస్ కి అరుదైన గౌరవం అంటూ ఆల్రడీ అభిమానులు సంబరపడిపోతున్నారు. వారి సంతోషమే బీజేపీకి కావాల్సింది. ఆ తర్వాత వారి ఓట్లే ఆ పార్టీ ఆశిస్తుంది.

First Published:  13 Sept 2022 8:19 AM IST
Next Story