అవునా.. బీజేపీ నాయకులు నిఖిల్ బదులు నితిన్‌ని పిలిచారా?
గత రెండు రోజులు సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి జేపీ నడ్డా.. కార్తికేయ-2 సినిమా హీరో నిఖిల్‌ను కలవాలని అనుకున్నారట. ఇటీవల విడుదలైన కార్తికేయ-2 పెద్ద హిట్ అయ్యింది.
తెలంగాణలో పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు అవసరమైన మార్గాలన్నింటినీ అన్వేషిస్తోంది. తమదైన శైలిలో టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించడం, మతానికి సంబంధించిన విషయాలపై రచ్చ చేస్తూ తమ ఉనికిని కాపాడుకుంటోంది. బండి సంజయ్ పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఆ యాత్రకు కాస్తో కూస్తో జన సమీకరణ కూడా జరుగుతోంది. కానీ ఇవన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చి పెడతాయా అనే అనుమానం జాతీయ నాయకత్వంలో నెలకొంది. తెలంగాణలో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అందుకే కొంత మంది సెలెబ్రిటీలను బీజేపీ తరపున ప్రచారం చేయిస్తే కొంచెం మైలేజీ వస్తుందని భావిస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ అగ్రనాయకులు సెలెబ్రిటీలతో వరుసగా భేటీ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో పాటు టాలీవుడ్ నటుడు నితిన్‌తో సమావేశం అయ్యారు. ఎన్టీఆర్, మిథాలీతో భేటీ అవడంపై ఎలాంటి ఆశ్చర్యం లేకపోయినా.. నితిన్‌ను జేపీ నడ్డా ఎందుకు కలిశారనే విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న నితిన్.. పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్. అంతే కానీ కనీసం జనసేన తరపున కూడా మాట్లాడడు. నితిన్ నోటి నుంచి ఏనాడూ పొలిటికల్ కామెంట్లు కూడా రావు. అలాంటిది ఏకంగా బీజేపీ చీఫ్‌తో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని ముంచెత్తింది.
గత రెండు రోజులు సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వాస్తవానికి జేపీ నడ్డా.. కార్తికేయ-2 సినిమా హీరో నిఖిల్‌ను కలవాలని అనుకున్నారట. ఇటీవల విడుదలైన కార్తికేయ-2 పెద్ద హిట్ అయ్యింది. కృష్ణతత్వం వంటి సబ్జెక్ట్‌ను సున్నితంగా డీల్ చేయడంతో ఉత్తరాదిన కూడా భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఆ సినిమా హీరో నిఖిల్‌ను కలవాలని రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించారు. అయితే, ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం నిఖిల్ బదులు నితిన్‌ను పిలిచారని సమాచారం. తీరా నోవోటెల్ వెళ్లి జేపీతో నితిన్ భేటీ అయినప్పుడు కాని.. అతడు కార్తికేయ-2 హీరో కాదని స్పష్టం అయ్యింది. దీంతో చేసేదేమీ లేక కాసేపు నితిన్‌తో మాట్లాడి పంపిచారని సమాచారం.
మొత్తానికి సినిమా హీరోల పేర్ల కన్ఫ్యూజన్ కారణంగానే నితిన్ అక్కడకు వెళ్లాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక, ఆ భేటీకి వెళ్లాల్సిన నిఖిల్ మాత్రం ఓ మంచి ఛాన్స్ మిస్సయ్యాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.