Telugu Global
Telangana

ఢిల్లీలో మండిపోతున్న ఎండలు.. హైదరాబాద్ లో వర్ష బీభత్సం

ములుగు, వికారాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వడగండ్లు పడ్డాయి.

ఢిల్లీలో మండిపోతున్న ఎండలు.. హైదరాబాద్ లో వర్ష బీభత్సం
X

ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగాయి, ఢిల్లీవాసులు ఉక్కపోతకు గురవుతున్నారు. బయట తిరిగేందుకు భయపడుతున్నారు. ఈ ఏడాది ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఈరోజే నమోదైంది. 35.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఢిల్లీలో నమోదైంది. గత ఆదివారం 34.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈరోజు ఆ రికార్డ్ ని క్రాస్ చేసింది ఢిల్లీ. మార్చి నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు మరింత భారీగా పెరుగుతాయని అంచనా.

ఢిల్లీ చరిత్రలో మార్చినెల అత్యధిక ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్. 1945 మార్చిలో ఆ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు రికార్డులు అందుబాటులో ఉన్నాయి. 2021 మార్చి 30న 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మార్చి సగం నెల గడిచే సమయానికే ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకున్నాయి. నెలాఖరు నాటికి కచ్చితంగా గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతుందని అంచనా.

ఇటు హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ అంతా భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ములుగు, వికారాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వడగండ్లు పడ్డాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో నగరవాసులకు ఊరట లభించింది. వర్షాలకు చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వడగండ్ల వానతో కొన్ని ప్రాంతాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.





జార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో కూడా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, వర్షాలు కురవడంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  16 March 2023 11:06 AM GMT
Next Story