ట్రాక్టర్లు, బోట్లు, హెలికాప్టర్లు.. అర్థరాత్రి కూడా ఆగని సహాయక చర్యలు
ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు పోలీసులు ట్రాక్టర్లను వినియోగించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్నచోట ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో ప్రజల్ని తరలించారు. ఒక్క మోరంచపల్లికే 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ప్రజలు మునుపెన్నడూ చూడని భారీ వర్షాలివి. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో ఊరులు, ఏరులు ఏకమయ్యాయి. ఆస్తిపాస్తుల్ని పక్కనపెట్టి బతుకుజీవుడా అంటూ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. అందరూ సమన్వయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం అర్థరాత్రి కూడా ఈ తరలింపుకి విరామం ఇవ్వలేదు. క్షణ క్షణం పెరిగిపోతున్న వరదనీటి మట్టం గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో వీలైనంత వరకు ముంపు ప్రాంతాల వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు.
ట్రాక్టర్లు, బోట్లు, హెలికాప్టర్లు..
ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు పోలీసులు ట్రాక్టర్లను వినియోగించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్నచోట ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో ప్రజల్ని తరలించారు. పసిబిడ్డలు, చిన్నారులు, వృద్ధులు, మహిళలకు మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఒక్క మోరంచపల్లికే 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం 600మందిని బయటకు తీసుకు రావడంతో ఆ గ్రామం ఖాళీ అయింది.
ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకున్న 11 మందిని రాత్రివేళ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. మునేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో గణేష్‌నగర్ లోని ఓ ఆశ్రమంలో, పద్మావతినగర్ లోని ఓ ఇంట్లో 11 మంది చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా పడవల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తెచ్చాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారంలోని ఆదర్శ పాఠశాల భవనం నీట మునగడంతో విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. ముస్తాబాద్ కేజీబీవీ విద్యార్థులను కూడా అక్కడినుంచి తరలించారు. పెద్దపల్లి జిల్లా మంథని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా గర్భిణులు, బాలింతలు, వారి బంధువుల్ని వేరేచోటకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరంగల్ కి ఊహించని నష్టం..
వరంగల్ చుట్టుపక్కల 150 కాలనీలు, హనుమకొండ, కాజీపేటలో 50 కాలనీలు నీట మునిగాయి. వరంగల్ నగరానికి వచ్చే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ములుగు జాతీయ రహదారులపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ముంపు కాలనీ వాసులకు ప్రభుత్వ సిబ్బంది, స్థానిక నాయకులు ఆహారం అందించారు. వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 2వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని ప్రాథమిక సమాచారం. వరద ప్రవాహాల్లో గురువారం 14 మంది గల్లంతు కాగా ఇద్దరు మృతిచెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 10 మంది వరదనీటిలో కొట్టుకుపోయారు.