విస్తారంగా వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం ఒక మోస్తారు వర్షానికే పరిమితం అయినా.. మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీగా వర్షం పడింది. జిల్లాల్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. నెల రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు.. రెండు రోజులుగా మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఖరీఫ్ పంటలకు ప్రాణం వచ్చినట్లు అయ్యింది. నెల రోజుల ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం దొరికింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణలోని తొమ్మిది జిల్లాకలు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం వరకు భారీ వానలు ఉంటాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
ఇక గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా నీరు వస్తున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టం ఉండటంతో.. నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.