Telugu Global
Telangana

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, హైదరాబాద్ లో మహిళ గల్లంతు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నాలాలో నీరుఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంట చేసుకునే సమయంలో ఆమె పొరపాటున నాలాలో పడిపోయింది. ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది.

భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, హైదరాబాద్ లో మహిళ గల్లంతు
X

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు దాటి పారుతున్నాయి. నిజామాబాద్‌ నగరానికి సమీపంలో పూలాంగ్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని ధార్పల్లి వద్ద రెండు వాగులు ఉప్పొంగి రోడ్లపైనుంచి ప్రవహిస్తున్నాయి. వెంగల్పడ్ వద్ద బ్రిడ్జ్ పైనుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇందల్ వాయి పెద్ద చెరువుకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. లో గంగమ్మ గుడి. శివాలయంలోకి నీరు చేరుకుంది. పదిహేనేళ్ల తర్వాత ఇందల్ వాయి చెరువుకి ఆ స్థాయిలో నీళ్లు వచ్చాయని అంటున్నారు స్థానికులు. గన్నారం చిన్నవాగు ఉదృతంగా ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

జగిత్యాల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. స్కూళ్లకు సెలవలు ప్రకటించారు. హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో ఓ మహిళ గల్లంతయింది. ఆమె జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గాంధీ నగర్ ఎస్‌బీఐ కాలనీలోని దామోదరం సంజీవయ్య నగర్‌ లో హుస్సేన్ సాగర్ నాలా ఒడ్డున చిన్న ఇంట్లో లక్ష్మి అనే మహిళ నివశిస్తోంది. ముగ్గురు కుమార్తెలకు వివాహం కాగా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవలే ఇంటి వెనుకవైపు గోడ కూలిపోగా ప్రహరీలేక ఇబ్బందులు పడుతోంది లక్ష్మి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నాలాలో నీరుఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంట చేసుకునే సమయంలో ఆమె పొరపాటున నాలాలో పడిపోయింది. ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. ఆమెకోసం మూడు డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నాలా రూట్ మ్యాప్ చూస్తూ గాలిస్తున్నాయి.

First Published:  4 Sept 2023 6:31 PM IST
Next Story