Telugu Global
Telangana

భారీ వర్షాలు.. అయినా చెక్కుచెదరని చెరువులు. కారణం ఏంటి..?

కేవలం 155 చెరువులకు మాత్రమే కట్టలు తెగాయి, మరమ్మతులు అవసరమయ్యాయి. ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి.

భారీ వర్షాలు.. అయినా చెక్కుచెదరని చెరువులు. కారణం ఏంటి..?
X

2010లో భారీ వర్షాలకు తెలంగాణ ప్రాంతంలో తెగిన చెరువుల సంఖ్య 4251

2023లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయినా ఈ సీజన్ లో తెగిన చెరువులు కేవలం 155

తెలంగాణ చరిత్రలోనే ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ పడలేదు. ఏడాదంతా కురిసే వర్షం ఒక్కరోజులోనే కురిసింది. అయినా కూడా చెరువులకు ఆ స్థాయిలో గండ్లు పడలేదు. కేవలం 155 చెరువులకు మాత్రమే కట్టలు తెగాయి, మరమ్మతులు అవసరమయ్యాయి. ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి.

కారణం మిషన్ కాకతీయ..

మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి సాధ్యమైంది. రాష్ట్రంలో మొత్తం 46,531 చెరువులు ఉండగా, వాటిలో 27,627 చెరువులను పూర్తి స్థాయిలో మరమ్మతు చేశారు. 9,155కోట్ల రూపాయలతో నాలుగు దశల్లో ఈ పని పూర్తి చేశారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువులు నేడు అద్భుతంగా ఉన్నాయి. ఆయా చెరువుల విషయంలో పరివాహక ప్రాంత ప్రజలు ఎంతటి భారీ వర్షాలయినా దిగులు లేకుండా ఉన్నారు.

చెరువుల్లో పూడిక తీయడం, కట్టల బలోపేతం, తూముల నిర్మాణం, అలుగుల మరమ్మతులు వంటివి పూర్తయ్యాయి. భూగర్భ జలమట్టం కూడా బాగా పెరిగింది. దీంతో చెరువులకింద రెండు పంటలకు భరోసా లభించింది. మత్య్స సంపద పెరిగింది, పాడిపరిశ్రమకు ఊతం లభించింది. ఇదంతా మనకు తెలిసి జరిగిన మేలు. కానీ ఇప్పుడు కురిసిన భారీ వర్షాలతో మనకు తెలియకుండా జరిగిన మేలు ఏంటో తెలిసొచ్చింది. మిషన్ కాకతీయ లేకపోతే.. ఈ దఫా కురిసిన వర్షాలకు చెరువులన్నీ ఊళ్లపై పడేవి. కానీ పూర్తి స్థాయి మరమ్మతుల కారణంగా చెరువులు కట్టలు తెంచుకోలేకపోయాయి. కేవంల 155 చోట్ల మాత్రమే గండ్లుపడి పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బంది పడిన ఉదాహరణలున్నాయి. గతంతో పోల్చి చూస్తే ఇది పూర్తిగా నామమాత్రం.

తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఏర్పాటు చేశారు. ఆ విభాగానికి చీఫ్ ఇంజినీర్ ని నియమించారు. ప్రాజెక్ట్ లు, పంపులు, కాల్వలు, చెరువులు, తూముల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత ఆ విభాగానికి అప్పగించారు. సత్వర మరమ్మతులకు అవసరమైన నిధుల విషయంలో కూడా వారికే అధికారాలు కట్టబెట్టారు. దీంతో ఎక్కడా వేచి చూడాల్సిన అవసరం లేకుండా పనులు పూర్తవుతున్నాయి. అందుకే తెలంగాణలో భారీ వర్షాలు పడినా చెరువులు చెక్కుచెదరలేదు.

First Published:  31 July 2023 11:11 AM IST
Next Story