Telugu Global
Telangana

మూసీకి పోటెత్తిన వరద.. బాధితులకోసం పునరావాస కేంద్రాలు

గోషామహల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. కుత్బుల్లాపూర్ వరద ప్రాంతాల్లో కూడా మేయర్ పర్యటించారు.

మూసీకి పోటెత్తిన వరద.. బాధితులకోసం పునరావాస కేంద్రాలు
X

నెలన్నర క్రితం భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. మళ్లీ అలాంటి సీన్ రిపీట్ అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మూసీకి వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల్లా మారడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. హిమాయత్‌ సాగర్‌ లో నాలుగు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తున్నారు. హిమాయత్‌ సాగర్‌లో ప్రస్తుతం 1764 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. ఉస్మాన్‌ సాగర్‌ జలాశయంలో రెండు గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది.


మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. చాదర్‌ ఘాట్‌ లో లోయర్‌ బ్రిడ్జి సమీపంలో ఉన్న కాలనీ వాసులను అక్కడినుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసారం బ్రిడ్జి వద్ద వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోషామహల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. బాధితులను ఓదార్చిన మేయర్ వారికి భోజన వసతితో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. కుత్బుల్లాపూర్ వరద ప్రాంతాల్లో కూడా మేయర్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

బాచుపల్లి నాలాలో పడి బాలుడు మృతి..

మేడ్చల్ జిల్లా బాచుపల్లి వద్ద ఎన్నారై కాలనీలో మిథున్ అనే నాలుగేళ్ల బాలుడు నాలాలో పడిపోయాడు. మ్యాన్ హోల్ తెరచి ఉండటంతో బాలుడు నాలాలో కొట్టుకుపోయాడు. డీఆర్ఎఫ్ బృందాలు గాలించినా ఫలితం లేదు, బాలుడి మృతదేహం లభ్యమైంది.

First Published:  5 Sept 2023 6:37 PM IST
Next Story