తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపు
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతాయనే అంచనా మేరకు సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెపిరి లేకుండా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచే వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై భారీగా వరద చేరడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు పడతాయనే అంచనా మేరకు బుధ, గురువారాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ వర్షాలు శుక్రవారం కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతాయనే అంచనా మేరకు సెలవు ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి మౌఖిక ఆదేశాలు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు అందాయి. కాసేపట్లో జీవో జారీ అయ్యే అవకాశం ఉన్నది. ఇక శనివారం మొహర్రం సందర్భంగా సాధారణ సెలవు ఉన్నది. ఆదివారం ఎలాగో వారాంతపు సెలవు ఉంటుంది. దీంతో పాఠశాలలు సోమవారం తిరిగి తెరుచుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణంగా వరుసగా ఐదు రోజులు బడులు మూతబడటం గమనార్హం.
వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు..
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా.. వరద ముంపునకు గురయ్యే జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరు జిల్లాలకు ప్రత్యేక అధికారులను కేటాయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్లులు జారీ చేసింది.
ములుగు - కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి
భూపాలపల్లి - పి. గౌతమ్, సెర్ప్ సీఈవో
నిర్మల్ - ముషారఫ్ అలీ, ఎక్సైజ్ శాఖ కమిషనర్
మంచిర్యాల - భారతి హొలికేరి, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రత్యేక కార్యదర్శి
పెద్దపల్లి - సంగీత సత్యనారాయణ
ఆసిఫాబాద్ - హన్మంతరావు, పంచాయతీరాజ్ శాఖ, కమిషనర్