హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీ హై అలర్ట్.. మూసారాంబాగ్ బ్రిడ్జీ మూసివేత
హైదరాబాద్ నగరాన్ని మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ పశ్చిమం వైపు భారీ వర్షం కురిసింది. అయితే బుధవారం మాత్రం నగరమంతా భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరాన్ని మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ పశ్చిమం వైపు భారీ వర్షం కురిసింది. అయితే బుధవారం మాత్రం నగరమంతా భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాత నగరంలోని మెహిదీపట్నం, గోషామహల్, ఆసిఫ్‌నగర్, పురానాపూల్, బహదూర్ పురా, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్‌తో పాటు.. లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, మలక్‌పేటతో పాటు పలు ప్రాంతాల్లో వాన కారణంగా రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి.
నిన్నటి వరదకు తోడు ఇవ్వాళ్టి భారీ వర్షం తోడవడంతో మూసీ నదికి భారీగా వరద వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా మూసారాంబాగ్ లో లెవెల్ వంతెనపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతోంది. మూసారాంబాగ్ నుంచి ఛే నెంబర్ వైపు వెళ్లే ట్రాఫిక్ మళ్లించడంతో నల్గొండ క్రాస్ రోడ్, చాదర్‌ఘాట్ బ్రిడ్డి వైపు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
భారీ వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది. మూసీ ఎగువ భాగంలో వర్షాలు పడుతుండటం.. నగరంలో కూడా ఆగకుండా వర్షం పడుతుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు. వాహనదారులు రోడ్లపై నిలిచిన నీటిలో నుంచి అజాగ్రత్తగా వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. అంతే కాకుండా భారీ వర్షం కారణంగా గణేష్ మండపాల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరించారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగాయని.. నీళ్లు నిలవకుండా సరైన చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
ఖైరతాబాద్ గణేష్ దర్శనాలు నిలిపివేత..
భారీ వర్షం కారణంగా ఖైరతాబాద్‌లో ప్రతిష్టించిన భారీ వినాయక విగ్రహం దర్శనాలను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షానికి వరద వచ్చి చేరుతోంది. క్యూ లైన్లో నిలబడిన వారి మోకాళ్ల వరకు నీళ్లు వచ్చాయని.. ముందు జాగ్రత్త చర్యగా దర్శనాలను నిలిపివేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు.