హైదరాబాద్‌లో కుండపోత.. వరదతో నిండిన రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
స్కూల్స్, ఆఫీసులు ముగిసే సమయంలో వర్షం పడటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మేఘాలకు తోడు భారీవర్షం తోడవడంతో రోడ్లపై ఎదుటి వాహనాలు కనపడక ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం దాటిన తర్వాత నగరమంతా మేఘావృతమై చీకట్లు అలుముకున్నాయి. చూస్తుండగానే కుండపోతగా వర్షం పడింది. దాదాపు గంట నుంచి పడుతున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, బేగంపేట, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో జనజీవనం స్తంభించింది.
స్కూల్స్, ఆఫీసులు ముగిసే సమయంలో వర్షం పడటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన మేఘాలకు తోడు భారీవర్షం తోడవడంతో రోడ్లపై ఎదుటి వాహనాలు కనపడక ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో కరెంట్‌ను కట్ చేసింది. మరోవైపు భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా తోడయ్యాయి. పలు చోట్ల హోర్డింగులు ఊగుతూ భయభ్రాంతులు కలిగిస్తున్నాయి.
అమీర్‌పేట, చాదర్‌ఘాట్, మలక్‌పేట మార్కెట్, నాగోల్, రసూల్‌పుర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ద్విచక్రవాహనదారులు ముందుకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. గత రాత్రే జీహెచ్ఎంసీ నగర ప్రజలను అప్రమత్తం చేసింది. అధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయమని కూడా చెప్పింది.
ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నాయి. నాలాలు, మ్యాన్‌హోల్స్ వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎగువ భాగంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీకి వరద ఉధృతి తగ్గింది. కానీ శుక్రవారం సాయంత్రం నుంచి పడుతున్న భారీ వర్షానికి మళ్లీ మూసీలో నీటిమట్టం పెరుగుతోంది. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ కాజ్‌వేల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ
నగర ప్రజలు బయటకు రావొద్దని.. మరో రెండు రోజులు ఇలాగే భారీ వర్షాలు ఉంటాయని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఏ ప్రాంతంలో అయినా వరద ఉధృతి పెరిగితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయాలని సూచించింది. ఇందుకు 040-21111111, 040-29555500 నంబర్లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొన్నది. వర్షాల్లో వ్యక్తిగత వాహనాల బదులు సిటీ బస్సులు, మెట్రో రైలు సర్వీసులను ఉపయోగించాలని పేర్కొన్నది.