తెలంగాణకు అతి భారీ వర్షసూచన..బీ అలర్ట్..!
తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాబోయే 48 గంటల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని...ఈ మూడు రోజులు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక సోమవారం ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో..భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసిన వాతావరణ శాఖ..ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం..సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు.ఈ ఆవర్తనంను ఆనుకుని ద్రోణి ఉత్తరాంధ్ర తీరం వరకు..సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు మరియు 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందన్నారు. మరో ఆవర్తనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. దీని ప్రభావంతో ఈ నెల 6 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. కడెం జలాశయంలోకి 33 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో..2 వరద గేట్లను ఎత్తి 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గడంతో వరద గేట్లు మూసివేశారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 696.40 అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గోదావరి తీర ప్రాంతం వైపు పశువుల కాపరులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.