Telugu Global
Telangana

ఐదు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణకు రెడ్ అలర్ట్

హైదరాబాద్ పరిధిలో మంగళవారం అత్యధికంగా మియాపూర్ లో 1.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మల్కాజ్ గిరిలో 0.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఐదు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణకు రెడ్ అలర్ట్
X

తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. ఇవి అతి భారీ వర్షాలుగా మారి, ఐదురోజులపాటు కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల కలెక్టర్లు సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నీటి పారుదలశాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

బల్దియా అప్రమత్తం..

ఇటు హైదరాబాద్ లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ (040-2111 1111) ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో 168 అత్యవసర బృందాలను రంగంలోకి దించారు. ఇందులో 64 మొబైల్‌, 104 మినీ మొబైల్‌ బృందాలు, 160 స్టాటిక్‌ లేబర్ టీమ్స్‌ ఉంటాయి. మొబైల్‌, మినీ మొబైల్‌ ఎమర్జెన్సీ టీమ్‌ లకు షిప్టుల వారీగా కార్మికులను కేటాయించారు. ప్రతి చెరువుకు ఒక ఇన్‌ చార్జి, ఇద్దరు పర్యవేక్షకులను నియమించారు. వరద అంచనాను బట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జోన్ల వారీగా వరద ప్రభావిత ప్రాంతాలకు ఇన్‌ చార్జిలను నియమించారు.

హైదరాబాద్ పరిధిలో మంగళవారం అత్యధికంగా మియాపూర్ లో 1.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మల్కాజ్ గిరిలో 0.43 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో మరో రెండురోజులపాటు భారీ వర్షాలకు అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

First Published:  19 July 2023 6:01 AM IST
Next Story