నేడు సుప్రీంలో విచారణ.. ఆగమేఘాల మీద మూడు బిల్లులు ఆమోదించిన గవర్నర్ తమిళిసై
సుప్రీంకోర్టు అడిగితే.. మూడింటికి ఆమోదం తెలిపామని.. మిగిలిన వాటిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన పది బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించకుండా చానాళ్ల నుంచి తన వద్దే ఉంచుకున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇవ్వాళ రెండో దఫా విచారణ అత్యున్నత న్యాయస్థానంలో జరుగనున్నది. ఈ క్రమంలో గవర్నర్ ఆగమేఘాల మీద మూడింటికి ఆమోదం తెలిపారు.
సుప్రీంకోర్టు అడిగితే.. మూడింటికి ఆమోదం తెలిపామని.. మిగిలిన వాటిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. గవర్నర్ తమిళిసై వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుతో పాటు మరో రెండు ఆమోదించినట్లు సమాచారం. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చట్ట సవరణ బిల్లులను వెనక్కి పంపించారు. మరో రెండు బిల్లులను పరిశీలన కోసం రాష్ట్రపతి వద్దకు పంపించారు. మరో మూడు బిల్లులను తన వద్దే ఉంచారు.
సుప్రీంకోర్టులో 10 బిల్లులపై కదలిక వచ్చినట్లు చెప్పుకోవడానికి సోమవారం ఉదయం బిల్లులను ఆమోదించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.