Telugu Global
Telangana

మొన్న సీఎం అవుతానని.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌

మొన్న సీఎం అవుతానని.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని
X

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నారు. సంగారెడ్డిలోని అంబేద్కర్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన దసరా సంబురాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య నిర్మలా రెడ్డి లేదా తన అనుచరుడు ఆంజనేయులుకు పోటీచేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో చర్చిస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా తోపాజీ అనంతకిషన్‌కు అవకాశం ఇవ్వాలని, దీనిపై అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న పైసలన్నీపండుగలకు ఘనంగా నిర్వహించడానికే ఖర్చు చేస్తానని, వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు పంచడం ఇష్టం లేదన్నారు. 2023లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ. 2 వేల చొప్పున పంచి తనను ఓడించారని ఆరోపించారు. ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటానని, సీఎంతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని అన్నారు.

జగ్గారెడ్డి సతీమణి గత ఎన్నికల సమయంలోనే సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు నుంచే ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఆయన కూతురు జయారెడ్డి 2018, 2023 ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేశారు. జగ్గారెడ్డి సతీమణి, కూతురే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలో ఇంటింటి ప్రచారం చేశారు. తాను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతానన్న జగ్గారెడ్డి ఇప్పుడు పోటీ చేయనని ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

First Published:  14 Oct 2024 10:34 AM IST
Next Story