సీఎం అంటే కటింగ్ మాస్టర్.. రుణమాఫీ లెక్కలు చెప్పిన కేటీఆర్
రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్క రైతు వేదికలో అయినా 100 శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు కేటీఆర్.
ఉద్యోగులకు కట్..
పెన్షనర్లకు కట్..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే కట్..
ఎన్నికల ముందు రుణమాఫీ విషయంలో ఈ కండిషన్లేవీ చెప్పకుండా.. ఇప్పుడు రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, కటింగ్ మాస్టర్ అనే కొత్త అర్థాన్ని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. తెలంగాణలో జరుగుతున్న రుణమాఫీ మొత్తం బోగస్ అని.. అది మిలియన్ డాలర్ల జోక్‌గా తేలిపోయిందని విమర్శించారు. స్వతంత్ర భారత దేశంలోనే రైతులకు జరిగిన అతిపెద్ద మోసం ఇదని అన్నారు కేటీఆర్.
CM అంటే కటింగ్ మాస్టర్ అన్నట్టు పరిస్థితి మారింది.
— BRS Party (@BRSparty) August 16, 2024
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/PHeqQbpOnt
రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తే 40వేల కోట్ల రూపాయల అవుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని, ఎన్నికలైపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఈ లెక్కని సునాయాసంగా మార్చేశారని విమర్శించారు కేటీఆర్. 31వేల కోట్లతో రుణమాఫీ చేయాలని కేబినెట్ తీర్మానించిందని, ఆ తర్వాత ఇప్పుడు కొర్రీలు పెట్టి దాన్ని 18వేల కోట్ల రూపాయలకు పరిమితం చేశారన్నారు. 60 శాతం మందికి ఎగ్గొట్టి.. కేవలం 40 శాతం మందికి రుణాలు మాఫీ చేసి.. 100 శాతం అంటూ సీఎం డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.
దమ్ముంటే నా సవాల్ స్వీకరించు..
రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ చేసిన రుణమాఫీ నిజమైతే, ఆయన సొంత నియోజకవర్గానికే మీడియాని తీసుకెళ్లి లెక్కలు తేల్చుదామన్నారు. ఒక్క రైతు వేదికలో అయినా 100 శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. సీఎంకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. అంకెలు మార్చి.. రంకెలు వేయడం మినహా రేవంత్ రెడ్డి చేస్తున్నదేమీ లేదన్నారు కేటీఆర్.
రుణమాఫీ మోసంపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దమ్మున్న సవాల్ pic.twitter.com/WX1uoec0kJ
— BRS Party (@BRSparty) August 16, 2024
అన్నీ మోసాలే..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదటి మోసం, లోక్‌సభ ఎన్నికలకు ముందు దేవుడి మీద ఒట్లు పెట్టి రెండో మోసం.. సకలజనులకు మరో మోసం.. కాంగ్రెస్ పాలన అంతా మోసాలతోనే ఉందన్నారు కేటీఆర్. రెండు లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డలకు నెలకు రూ.2500, తులం బంగారం, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, 4వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, దళితులకు రూ.12లక్షలు, ఆటో అన్నలకు ఏడాదికి రూ.12 వేలు, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు, కౌలు రైతులకు రైతు భరోసా.. ఇవన్నీ కాంగ్రెస్ చేసిన మోసాలేనని చెప్పారు కేటీఆర్.