రామలింగరాజు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీపై 'స్టే'.. మూడు వారాల్లోగా తేల్చేయమన్న హైకోర్టు
నెట్‌ఫ్లిక్స్ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు.. మూడు వారాల్లోగా ఆ స్టేకు సంబంధించిన కేసును తేల్చేయాలని సివిల్ కోర్టును ఆదేశించింది.
రామలింగరాజు-నెట్‌ఫ్లిక్స్ మధ్య రెండేళ్లుగా సిటిల్ సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ కేసును మూడు వారాల్లోగా తేల్చేయాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పటి సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజుకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. 'బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ - ఇండియా' పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీని 2020 అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది. మొత్తం నాలుగు ఎపిసోడ్లు ఉన్న ఈ డాక్యుమెంటరీలో ఒకటి రామలింగరాజుపై రూపొందించింది. అయితే అప్పట్లో రామలింగరాజు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో కేవలం మూడు ఎపిసోడ్లు మాత్రమే ప్రసారం చేసింది.
గత రెండేళ్లుగా ఆ ఎపిసోడ్ ప్రసారంపై స్టే ఉండటంతో.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ దానిపై ఉన్న స్టేను ఎత్తేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. నెట్‌ఫ్లిక్స్ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు.. మూడు వారాల్లోగా ఆ స్టేకు సంబంధించిన కేసును తేల్చేయాలని సివిల్ కోర్టును ఆదేశించింది. కాగా, నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఈ బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ - ఇండియాలో మొత్తం నలుగురి జీవితాలపై డాక్యుమెంటరీలు ఉన్నాయి. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, సహారా గ్రూప్ సుబ్రతారాయ్, నగల వర్తకుడు నీరవ్ మోడీతో పాటు రామలింగరాజుకు సంబంధించిన విశేషాలను కూడా చిత్రీకరించారు. ఈ నలుగురు కూడా ఆర్థికపరమైన నేరాల్లో ఇరుక్కున్న వాళ్లే. అయితే తన గురించి తప్పుగా చిత్రీకరించారని భయపడిన రామలింగరాజు అప్పట్లో నెట్‌ఫ్లిక్స్‌పై కోర్టుకు ఎక్కారు.
2020 అగస్టులో ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో డాక్యుమెంటరీని రిలీజ్ చేయవద్దని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఎపిసోడ్ రిలీజ్ అయితే తన గౌరవానికి భగం కలిగిస్తుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రామలింగరాజు పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ రిలీజ్ చేయవద్దని స్టే ఆర్డర్ జారీ చేసింది. కాగా, ఈ స్టే ఆర్డర్ రద్దు చేయాలని కోరుతూ అదే ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. రెగ్యులర్ డివిజన్ బెంచ్ ఈ స్టే ఆర్డర్‌కు సంబంధించిన విచారణను రెండు నెలల పాటు కొనసాగించింది. అయితే అప్పటి చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బదిలీపై వెళ్లిపోవడం. కరోనా పాండమిక్ కారణంగా కోర్టు ఆన్‌లైన్ ప్రొసీడింగ్స్ చేపట్టడంతో కేవలం ముఖ్యమైన కేసులు మాత్రమే విచారణకు తీసుకుంది.
అయితే, బ్యాడ్ బాయ్ బిలియనీర్స్-ఇండియాపై తాము భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టామని, స్టే ఆర్డర్ కారణంగా తమకు నష్టం వస్తోందని హైకోర్టుకు మరోసారి రిక్వెస్ట్ చేసింది. దీంతో బుధవారం జస్టిస్ షమీన్ అక్తర్, జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్ కేసును విచారించింది. కింది కోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, హైకోర్టులో ఇప్పటికే వెకేట్ పిటిషన్ దాఖలు చేశామని.. మరో సారి చేయాల్సిన అవసరం లేదని నెట్‌ఫ్లిక్స్ తరపు న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి తెలిపారు. దీంతో కిందికోర్టులో వెకేట్ పిటిషన్ వేయాలని, సివిల్ కోర్టు మూడు వారాల్లోగా ఈ విషయాన్ని తేల్చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.