దేశంలోనే అరుదైన కేసును ఛేదించిన హైదరాబాద్ పోలీసులు.. - రూ.900 కోట్ల హవాలా
చైనీస్ రహస్యంగా మన దేశంలో చొరబడి.. ఇలాంటి ఫ్రాడ్ ఆపరేషన్లు చేస్తున్నారని, ఇది హైదరాబాద్ సిటీ పోలీసులు సాధించిన అరుదైన ఘనత అని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
దేశంలోనే అరుదైన కేసును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఆథరైజ్డ్ మనీ ఎక్స్‌ఛేంజర్ల ద్వారా ఇండియన్ రూపీని డాలర్లలోకి మార్చేసి.. హవాలా మనీని విదేశాలకు పంపే భారీ మోసమిది. ఈడీ, ఐటీ, డీఆర్ఏ.. కూడా పట్టుకోని ఈ అరుదైన కేసు వివరాలను హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్రాడ్‌గా చెబుతున్న ఈ కేసులో రూ.900 కోట్ల హవాలా వ్యవహారం నడిచినట్టు తెలిపారు. అయితే ఈ వ్యవహారం ఇంతకుమించి రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో మొత్తం 12 మందిని ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు చైనీస్, ఐదుగురు ఢిల్లీ వాసులు, ముగ్గురు హైదరాబాదీయులు వీరిలో ఉన్నారు. వీరందరినీ సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండుకు తరలించారు.
చైనీస్ రహస్యంగా మన దేశంలో చొరబడి.. ఇలాంటి ఫ్రాడ్ ఆపరేషన్లు చేస్తున్నారని, ఇది హైదరాబాద్ సిటీ పోలీసులు సాధించిన అరుదైన ఘనత అని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ హవాలా వ్యవహారం ఫెమా చట్టం ఉల్లంఘన అని ఆయన తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా జరిగే మోసమని ఆయన చెప్పారు. దేశంలోనే.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల పరిధిలోకి ఇలాంటి ఒక కేసు ఇప్పటివరకు రాలేదని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ తెలిపారు. ఇలాంటి కేసును ఛేదించడం దేశంలోనే తొలిసారి అని, ఇది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సాధించిన ఘనత అని ఆయన ప్రశంసించారు.
ఈ వ్యవహారాన్ని చైనా దేశీయులు చాలా రహస్యంగా ఆపరేట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. వల పన్ని మరీ వారిని పట్టుకోవడం అనేది అభినందనీయమని ఆయన చెప్పారు. హైదరాబాద్ సిటీ పోలీసులు, సైబర్ క్రైమ్, సీసీఎస్ పోలీసులు సాధించిన అరుదైన ఘనత ఇదని సీపీ ఈ సందర్భంగా తెలిపారు.