Telugu Global
Telangana

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టిందా?

వెంకట్‌రెడ్డి వ్యవహారం రోజు రోజుకూ ముదిరి పోతుండటంతో అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఉంటే పార్టీలో ఉండనీ, పోతే పోనియ్యండి.. కానీ అతడి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దని రాష్ట్ర నాయకులకు హైకమాండ్ చెప్పినట్లు సమాచారం.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టిందా?
X

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం కోపంగా ఉందా? మునుగోడు ఉపఎన్నిక ముగిసే వరకు అతడిని లైట్ తీసుకోవాలని తెలంగాణ నేతలకు చెప్పిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు స్వయంగా తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే కారణం అయినా.. వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగానే విమర్శలు చేస్తున్నారు. సోద‌రుడిని పార్టీలో ఉంచడంలో విఫలమ‌వ‌డ‌మే కాకుండా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇతర సీనియర్లపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉంటే.. వెంకట్‌రెడ్డి మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఇతర నేతలపై విమర్శలు చేయడం, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం పార్టీలో ఎవరికీ రుచించడం లేదు. అద్దంకి దయాకర్ విషయంలో స్వయంగా రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పినా.. వెంకట్‌రెడ్డి మాత్రం అలక మానలేదు. వెంకట్‌రెడ్డి వ్యవహారం రోజు రోజుకూ ముదిరి పోతుండటంతో అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఉంటే పార్టీలో ఉండనీ, పోతే పోనియ్యండి.. కానీ అతడి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దని రాష్ట్ర నాయకులకు హైకమాండ్ చెప్పినట్లు సమాచారం.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉపఎన్నికకు సహకరించకపోయినా.. పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోండి అని హైకమాండ్ పార్టీ నాయకులకు సూచించింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులతో మునుగోడులు సమావేశాలు ఏర్పాటు చేయాలని, వారిని పార్టీ కోసం పని చేసేలా ఒప్పించాలని హైకమాండ్ స్థానిక నేతలను ఆదేశించింది. మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని, దీన్ని ఉపయోగించుకుని గెలుపు కోసం కృషి చేయాలని కోరింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారం చూస్తుంటే.. తమ్ముడి గెలుపున‌కు పరోక్షంగా సహకరిస్తున్నట్లే కనిపిస్తోంద‌ని స్థానిక నాయకత్వం కూడా హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది.

వెంకట్‌రెడ్డి కావాలనే ఎన్నికల సమయం చూసుకుని రచ్చ చేస్తున్నారని కూడా రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపఎన్నికకు సంబంధించి రేవంత్ రెడ్డికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అధిష్టానం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అప్పటి వరకు ఆయనను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవాలని సూచించింది.

First Published:  17 Aug 2022 9:28 AM GMT
Next Story