కాంగ్రెస్ గ్యారంటీల గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ గ్యారంటీల గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. కర్నాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అని అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేశారని.. అందుకే హర్యానాలో ఏడు గ్యారంటీలు ఇచ్చినా పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ మోసాలను దేశం మొత్తం గమనిస్తోందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్నారు. అబద్ధపు హామీలతో వంచిస్తే తగిన సమయంలో బుద్ధి చెప్తారని ముందు నుంచే చెప్తున్నామని, తాము చెప్పినట్టుగానే ఈ రోజు కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలు చిత్తు కాగితాలతో సమానం అయ్యాయన్నారు. మోసం చేసి గద్దెనెక్కాలని చూసిన కాంగ్రెస్ కు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని.. కాంగ్రెస్ గ్యారంటీలకు వారంటీ లేదని స్పష్టంగా తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, ఈ ఓటమికి రాహుల్ గాంధీ బలహీనమైన నాయకత్వం కూడా కారణమన్నారు. బీజేపీని నిలువరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, వాటి ఫలితాలు కూడా రెండు జాతీయ పార్టీలకు ఆశాజనకంగా ఉండవని తాము భావిస్తున్నామని తెలిపారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సాధారణ మెజార్టీ సాధ్యం కాదని ఈ ఫలితాలతో అర్థమవుతోందని, ప్రాంతీయ పార్టీలే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతాయని తెలిపారు. హర్యానా ఓటమితోనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలని, బుల్డోజర్ రాజ్, ఫిరాయింపులు, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాలకు హర్యానా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. రాహుల్ బలహీన నాయకత్వమే ప్రతిసాని బీజేపీకి వరంగా మారుతోందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బలే తగులుతాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ ఇలాంటి ఫలితమే రావడం ఖాయమన్నారు.