Telugu Global
Telangana

రేవంత్‌, గతం మరిచిపోయావా.. హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్‌

సీఎం వ్యవహరిస్తున్న తీరును, రెండు నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారని.. త‌గిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు హరీష్‌. గతంలో గ్రూప్‌-2 వాయిదాను కోరుతూ రేవంత్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.

రేవంత్‌, గతం మరిచిపోయావా.. హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్‌
X

డీఎస్సీ ఎగ్జామ్‌ వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రివి పరిణితి లేని వ్యాఖ్యలంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గతం మర్చిపోయారని విమర్శించారు. నాడు గ్రూప్‌-2, టెట్ ఎగ్జామ్స్‌ పోస్ట్‌పోన్ చేయాలని అభ్యర్థులు అడిగితె మద్దతు తెలిపిన విషయాన్ని మరిచిపోయారా అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు.


అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్‌ ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదో చెప్పాలన్నారు హరీష్‌ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట సరికాదన్నారు. ఈ తీరును చూసి ఊసరవెల్లి సైతం సిగ్గు పడుతోందంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలు, వారి జీవితాలతో రాజకీయం చేసింది కాంగ్రెసేనన్నారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడిరోడ్డున పడేలా చేశారన్నారు.

డీఎస్సీ పోస్ట్‌పోన్ చేయాలని కోరితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఒక సీఎం స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమన్నారు. రాత్రి, పగలు లెక్క చేయకుండా అభ్యర్థులు పోరాటం చేస్తుంటే సానుభూతి చూపించాల్సింది పోయి.. రాజకీయ విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. సీఎం వ్యవహరిస్తున్న తీరును, రెండు నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారని.. త‌గిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు హరీష్‌. గతంలో గ్రూప్‌-2 వాయిదాను కోరుతూ రేవంత్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.

ఇంతకీ సీఎం రేవంత్ ఏమన్నారంటే?

మహబూబ్‌నగర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. డీఎస్సీ వాయిదాను కోరుతూ నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమం ఆర్టిఫిషియల్ ఉద్యమం అన్నారు. పార్టీని బతికించుకోవడం కోసం BRS నేతలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హరీష్‌, కేటీఆర్ ఓయూ ముందు దీక్షకు కూర్చొని ప్రాణాలు వదిలితే.. డీఎస్సీని వాయిదా వేస్తామన్నారు రేవంత్. పరీక్షలు వాయిదా పడితే కోచింగ్ సెంటర్లు లాభపడతాయని చెప్పుకొచ్చారు సీఎం. కాగా, రేవంత్ వ్యాఖ్యలపై నిరుద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

First Published:  10 July 2024 9:27 AM IST
Next Story