తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్ల మెట్లెక్కా..
కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌కు వస్తారని చెప్పారు హరీష్ రావు. త్వరలో నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్ సమావేశమవుతారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో తనని సెల్ లో పెట్టని పోలీస్ స్టేషన్ ఏదీ లేదని గర్వంగా చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. పోరాటాలు తనకి కొత్త కాదని.. తెలంగాణలో దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల మెట్లెక్కానని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్లు, ఉద్యమాలు, పోరాటాలు.. దేనికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, కార్యకర్తలకు పార్టీ అండగా నిలబడుతుందన్నారు హరీష్ రావు. కార్యకర్తలెవరికైనా అన్యాయం జరిగితే వెంటనే తనకు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. వారి వద్దకే వచ్చి భుజం కలిపి పోరాటం చేస్తానన్నారు. గజ్వేల్‌లో జరిగిన కృతజ్ఞతా సభలో పాల్గొన్న ఆయన.. నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులంతా అండగా ఉంటామన్నారు హరీష్ రావు.
Watch Live : బీఆర్ఎస్ కృతజ్ఞత సభ - గజ్వేల్ నియోజకవర్గం@BRSHarish https://t.co/z8GlCrZ7no
— BRS Party (@BRSparty) January 18, 2024
కాంగ్రెస్ పై ప్రజలే తిరగబడతారు..
గజ్వేల్ లో కేసీఆర్ మంజూరు చేసిన పనులు ఆపితే.. ప్రజలు తిరగబడతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీష్ రావు. చేతనైతే కేసీఆర్ చేసిన పనులకంటే ఎక్కువ చేయాలని, ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని హితవు పలికారు. ఊళ్లల్లో నాట్లు తక్కువ పడుతున్నాయని.. సాగునీరు, కరెంట్ ఇస్తారో లేదో అనే అనుమానం ఉందన్నారు. పోయిన యాసంగితో పోల్చితే ఈసారి పంట సాగు తగ్గుతుందన్నారు. రైతుల్లో విశ్వాసం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేసీఆర్ వస్తారు..
కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌కు వస్తారని చెప్పారు హరీష్ రావు. త్వరలో నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్ సమావేశమవుతారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో నాయకులకు పూర్తిస్థాయిలో పార్టీ సహకారం ఉంటుందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కి అద్భుతమైన విజయం అందిస్తారన్నారు హరీష్.
కర్నాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని చెప్పారు హరీష్ రావు. తెలంగాణలో కూడా పరిస్థితి అలాగే ఉందని, ఇక్కడ కూడా కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు రావన్నారు. స్థానిక నాయకులతో పాటు, కేసీఆర్, తాను.. ప్రజలకు అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు హరీష్ రావు. గజ్వేల్ ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.