Telugu Global
Telangana

హైడ్రా కూల్చివేతల్లో గాయపడ్డ హోం గార్డుకు హరీశ్‌ రావు పరామర్శ

ప్రభుత్వమే వైద్యం చేయించాలని డిమాండ్‌

హైడ్రా కూల్చివేతల్లో గాయపడ్డ హోం గార్డుకు హరీశ్‌ రావు పరామర్శ
X

సంగారెడ్డిలోని మల్కాపూర్‌ చెరువులో హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న హోం గార్డ్‌ గోపాల్‌ ను మాజీ మంత్రి హరీశ్‌ రావు మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వమే ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఇతర నాయకులతో కలిసి హాస్పిటల్‌ కు వెళ్లిన హరీశ్‌ రావు గోపాల్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతున్నా ఒక్క అధికారి కూడా వచ్చి గోపాల్‌ ను పరామర్శించలేదని, హోం గార్డులంటే ఇంత చులకనా అని ప్రశ్నించారు. గోపాల్‌ కుటుంబం ఇప్పటికే చికిత్స కోసం రూ.లక్ష ఖర్చు చేసిందని, ప్రభుత్వం కనీసం వైద్య ఖర్చులు కూడా ఇవ్వడం లేదన్నారు. నాలుగు నెలల నుంచి గోపాల్‌కు జీతం ఇవ్వలేదని తెలిపారు. గోపాల్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయనకు పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలలు స్పీచ్‌ థెరపీ ఇవ్వాలని డాక్టర్లు చెప్తున్నారని అన్నారు. ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోరా అని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోపాల్‌ గాయపడ్డారని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

First Published:  1 Oct 2024 3:52 PM IST
Next Story