Telugu Global
Telangana

రైతుకు రూ.లక్ష కోట్లు.. ఆల్ టైమ్‌ రికార్డు - హరీష్‌ రావు ట్వీట్‌

కేవలం ఈ పథకాల ద్వారా ఖర్చు చేసిన మొత్తం లక్షా 20 వేల కోట్ల రూపాయ‌లుగా చెప్పారు హరీష్. ఇది దేశంలోనే ఆల్ టైమ్‌ రికార్డ్ అన్నారు.

రైతుకు రూ.లక్ష కోట్లు.. ఆల్ టైమ్‌ రికార్డు - హరీష్‌ రావు ట్వీట్‌
X

తెలంగాణలో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో ఈ స్థాయిలో రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయలేదని కాంగ్రెస్ చెప్తుంటే.. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ అమలు చేసి సాగును స్వర్ణయుగం చేసిన ఘనత తమదేనని బీఆర్ఎస్‌ నేతలు చెప్తున్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు ఇదే విషయంపై తాజాగా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన సాగుకు స్వర్ణయుగం అన్నారు. రైతు సంక్షేమ పథకాల కోసం దాదాపు రూ. లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తన ట్వీట్‌లో పేర్కొన్నారు హరీష్ రావు. రైతు బంధు కింద 69 లక్షల మంది రైతులు దఫదఫాలుగా రూ.79 వేల 972 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఇక లక్షా 11 వేల మంది రైతు కుటుంబాలకు రూ.6 వేల 488 కోట్లు రైతు బీమా, రెండు దఫాల్లో రుణమాఫీకి రూ.29 వేల 144 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రూ. 11.401 కోట్ల ఖర్చు పెట్టామన్నారు. కేవలం ఈ పథకాల ద్వారా ఖర్చు చేసిన మొత్తం లక్షా 20 వేల కోట్ల రూపాయ‌లుగా చెప్పారు హరీష్. ఇది దేశంలోనే ఆల్ టైమ్‌ రికార్డ్ అన్నారు.

ఇక ఎన్నికలకు ముందు రైతులకు రూ.2లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్‌.. గురువారం రూ.లక్షలోపు రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇలా దేశంలోనే గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు సీఎం రేవంత్. ఆగస్టు చివరి నాటికి రూ.2లక్షల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిబంధనల పేరుతో లబ్ధిదారులను భారీగా తగ్గించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కొండలు, గుట్టలతో పాటు కోట్ల రూపాయలు ఇన్‌ కం టాక్స్ కట్టే వాళ్లకు, వందల ఎకరాలు ఉన్న వాళ్లకు సైతం రైతుబంధు ఇచ్చారని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

First Published:  19 July 2024 11:40 AM GMT
Next Story