అప్ డేట్ లేని ఔట్ డేటెడ్ పొలిటీషియన్..
"ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్.." అని ఖమ్మం సభకు తనదైన శైలిలో నిర్వచనం ఇచ్చారు హరీష్ రావు.
ఖమ్మం కాంగ్రెస్ సభ, రాహుల్ ప్రసంగంపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో ఎదురుదాడి మొదలైంది. రాష్ట్రంలో పోడుపట్టాల పంపిణీ రాహుల్ కి కనిపించడంలేదా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. తాము పట్టాలు పంచిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఇచ్చేదేంటన్నారు. అప్ డేట్ తెలుసుకోలేని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు.
అది స్కాంగ్రెస్..
దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ కి ఉందని, అందుకే ఆ పార్టీని స్కాంగ్రెస్ అంటారని మండిపడ్డారు హరీష్ రావు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారడం వల్లే దేశప్రజలు కాంగ్రెస్ ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని, దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్ పుట్టిందని స్పష్టం చేశారు.
ఏ క్లాస్ టీమ్..
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనే ఆరోపణలపై కూడా హరీష్ రావు ఘాటుగా స్పందించారు. బీఆర్‌ఎస్ ఎవరికీ B టీం కాదని, తమది పేద ప్రజలకు A టీం అని, ప్రజల సంక్షేమం చూసే A క్లాస్ టీం అని కొత్త అర్థమిచ్చారు.
ప్రాజెక్ట్ ఖర్చుని మించి అవినీతా..?
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 80,321.57 కోట్లయితే, అవినీతే లక్ష కోట్లు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేయడం పెద్ద జోక్ అని అన్నారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని, కేంద్రం ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదని గుర్తు చేశారు. స్కామ్ లలో ఆరితేరిన కాంగ్రెస్.. కుంభకోణాల గురించి మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. భూములు అడిగితే జైల్లో వేసినవాళ్లు, కరెంట్ అడిగితే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు.. ఖమ్మంలో కల్లబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్లు ఎవరూ లేరన్నారు.
రాహుల్ స్కిట్..
ఖమ్మం సభకు తనదైన శైలిలో నిర్వచనం ఇచ్చి పంచ్ లు విసిరారు హరీష్ రావు. "ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్.." అని తేల్చేశారు.