Telugu Global
Telangana

హోదా అడగలేరు, ఉక్కుని తుక్కు చేసినా మాట్లాడలేరు..

ఏపీ మంత్రి కారుమూరి వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ఈసారి ఆయన డోసు పెంచారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలను కలిపి వాయించేశారు.

హోదా అడగలేరు, ఉక్కుని తుక్కు చేసినా మాట్లాడలేరు..
X

అనుకున్నంతా అయింది. తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వబోయి మరోసారి బుక్కయ్యారు ఏపీ మంత్రులు. హరీష్ రావు ఈసారి ఇంకాస్త గట్టిగా బదులిచ్చారు. ప్రత్యేక హోదాకి కేంద్రం ఎగనామం పెట్టినా ఏమీ చేయలేని నిస్సహాయులని ఏపీ అధికార, ప్రతిపక్షాలను కామన్ గా ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎవరూ మాట్లాడలేదన్న ఆయన, విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మౌనంగా ఉన్నారని చెప్పారు. అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని కౌంటర్‌ ఇచ్చారు. రెండు పార్టీలు జనాలను గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. "అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి.. అది మీకే మంచిది" అని ఏపీ మంత్రులకు ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు.

వివాదం ఇలా మొదలైంది..

ఇటీవల సంగారెడ్డి సభలో తెలంగాణ మంత్రి హరీష్ రావు వలస కార్మికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఘాటుగా తగిలాయి. "ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకదా, తెలంగాణలో ఎలాంటి పరిస్థితులున్నాయో చూశారు కదా.. మీరే మీ ఓటు ఎక్కడుండాలో నిర్ణయించుకోండి, అందరూ తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేయించుకోండి.." అని కార్మికులకు పిలుపునిచ్చారు హరీష్ రావు. దీనిపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. హరీష్ రావు ఓసారి ఆంధ్రాకి వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలన్నారు మంత్రి కారుమూరి. ప్రతి ఇంట్లోనూ మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మీ రోడ్ల సంగతి మీరు చూసుకోండి, చిన్న వర్షం పడితే హైదరాబాద్ నగరం మునిగిపోతుందని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఉన్న సంక్షేమ పథకాలు తెలంగాణలో లేవన్నారు.

మంత్రి కారుమూరి వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఈసారి ఆయన డోసు పెంచారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలను కలిపి వాయించేశారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని సవాల్‌ చేశారు హరీష్ రావు. "56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది.. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది.. కేసీఆర్‌ కిట్ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది.. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉంది" అంటూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి చెప్పారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏపీ, తెలంగాణ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ నేతలు గింజుకుంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తమ అసమర్థతని చాటి చెప్పుకున్నారు. ముందు ముందు ఇంకెంతమంది రియాక్ట్ అవుతారో చూడాలి.

First Published:  12 April 2023 1:30 PM GMT
Next Story