Telugu Global
Telangana

రాజీనామాల చరిత్ర మాది.. రాజీపడ్డ చరిత్ర మీది

తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన చరిత్ర తమదైతే.. రాజీపడ్డ చరిత్ర కాంగ్రెస్ ది అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. ఉద్యమాల చరిత్ర తమ పార్టీదయితే, స్వార్ధ రాజకీయ చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు.

రాజీనామాల చరిత్ర మాది.. రాజీపడ్డ చరిత్ర మీది
X

దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ దగా కార్యక్రమం అంటూ కళ్లలో నిప్పులు పోసుకుంటోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను చూడలేకే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగుతోందన్నారు. ప్రజలు పండగ చేసుకుంటుంటే కాంగ్రెస్ కి కంటగింపుగా మారడం సిగ్గుచేటన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంటోందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన చరిత్ర తమదైతే.. రాజీపడ్డ చరిత్ర కాంగ్రెస్ ది అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. ఉద్యమాల చరిత్ర తమ పార్టీదయితే, స్వార్ధ రాజకీయ చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. తెలంగాణ రాక ముందు వైద్యశాఖలో ఉన్న పరిస్ధితిని పూర్తిగా మార్చేశామన్నారాయన. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పై గోబెల్స్ ప్రచారానికి దిగుతోందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరులను అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగుతోందని మండిపడ్డారు. ప్రజలే కాంగ్రెస్ కి బుద్ధి చెబుతారన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో రేపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తారు. అనంతరం నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పర్యవేక్షించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు హరీష్ రావు.

First Published:  21 Jun 2023 6:43 PM IST
Next Story