Telugu Global
Telangana

రేవంత్‌కు ఆంధ్రా మూలాలు - హరీష్‌ రావు

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండకుండా కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. రేవంత్‌ రెడ్డికి ఆంధ్రాలో మూలాలున్నాయంటూ పరోక్షంగా చంద్రబాబు, రేవంత్ మధ్య సంబంధాలను ప్రస్తావించారు హరీష్ రావు.

రేవంత్‌కు ఆంధ్రా మూలాలు - హరీష్‌ రావు
X

సీఎం రేవంత్‌ రెడ్డిపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మీట్‌ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్ రావు.. హైదరాబాద్‌ను ఇప్పటికే పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచారని.. జూన్‌ 2తో గడువు ముగియబోతుందన్నారు. అయితే మరోసారి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలువురు ఆంధ్రా నేతలు ఈ విషయంపై విజ్ఞప్తులు చేస్తున్నారన్నారు.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండకుండా కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. రేవంత్‌ రెడ్డికి ఆంధ్రాలో మూలాలున్నాయంటూ పరోక్షంగా చంద్రబాబు, రేవంత్ మధ్య సంబంధాలను ప్రస్తావించారు హరీష్ రావు. రేవంత్ వాళ్లకు సహకరించే ప్రమాదం పొంచి ఉందన్నారు. గతంలో ఏడు మండలాలను ఏపీలో కలపాలని బీజేపీ చట్టం తెస్తే కాంగ్రెస్ మద్దతిచ్చిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం లోయర్ సీలేరు ప్రాజెక్టుతో పాటు ఏడు మండలాలను తెలంగాణకు దక్కకుండా రెండు జాతీయ పార్టీలు కుట్ర‌లు చేశాయన్నారు.


తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలిచేలా కాంగ్రెస్ ఒప్పందం చేసుకుందన్నారు హరీష్ రావు. తెలంగాణలో నిశ్శబ్ధ విప్లవం నడుస్తోందన్నారు. కాంగ్రెస్‌ రివర్స్ గేర్‌లో ఉందని, ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం దివాళా తీసిందని చెప్తారా అని ప్రశ్నించారు హరీష్ రావు. అలా ఐతే పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. రేవంత్ మాటలు రియల్ ఎస్టేట్ బిజినెస్‌ దెబ్బతినేలా చేశాయన్నారు. పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు హరీష్ రావు. బీజేపీ నేతలు అర్వింద్, మహేశ్వర్ రెడ్డి రేవంత్ బీజేపీలోకి వస్తాడని చెప్తుంటే.. మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు.

First Published:  4 May 2024 3:25 PM IST
Next Story