పథకాల్లో కోతలు, పేదలకు వాతలు - రేవంత్ సర్కార్‌పై హరీష్ సెటైర్లు
తెలంగాణపై బీఆర్ఎస్‌కు ఉన్న ప్రేమ బీజేపీ, కాంగ్రెస్‌లకు ఉండదన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఏనాడూ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక బస్సు స్కీమ్ తప్ప అన్ని పథకాలు తుస్సే అయ్యాయన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వర్ధన్నపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు హరీష్ రావు. అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే అభాసుపాలైందన్నారు. టీచర్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.
ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోవడంతో రేవంత్ సర్కార్ ధరలు పెంచే పనిలో పడిందన్నారు. రేపో, మాపో కరెంటు బిల్లులు పెరగబోతున్నాయన్నారు. భూముల విలువను పెంచి రిజిస్ట్రేషన్లు ఫీజులు సైతం భారీగా పెంచబోతున్నారన్నారు హరీష్ రావు. ఓ వైపు పథకాల్లో కోతలు.. మరోవైపు వాతలు అన్నట్లుగా రేవంత్ ప్రభుత్వం పనితీరు ఉందన్నారు.
తెలంగాణపై బీఆర్ఎస్‌కు ఉన్న ప్రేమ బీజేపీ, కాంగ్రెస్‌లకు ఉండదన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఏనాడూ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కాదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. గోదావరి నీటిని తమిళనాడులోని కావేరి నదికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వీటిని అడ్డుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.