మాటలు, మూటలు, మతాల మంటలు..
సొంత రాష్ట్రంలో బొక్కబొర్లపడ్డా నడ్డా.. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు హరీష్ రావు. నడ్డా, ఇది కేసీఆర్ అడ్డా అని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు అని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన అయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ దేనని ధీమాగా చెప్పారు. కేసీఆర్ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాటకాలు సాగవన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ లో మతకలహాలు జరిగేవని, తరచూ కర్ఫ్యూలు విధించేవారని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ గుర్తు భస్మాసుర హస్తం అని, దాన్ని నమ్మితే మోసపోతామని అన్నారు. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉందని, అక్కడ ఆడపిల్లల పెళ్ళికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. తాగు, సాగు, విద్యుత్, వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి సాధించామని చెప్పారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ పాలన ఉందన్నారు.
నడ్దా ఇది.. కేసీఆర్ అడ్డా..
సొంత రాష్ట్రంలో బొక్కబొర్లపడ్డా నడ్డా.. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు హరీష్ రావు. నడ్డా, ఇది కేసీఆర్ అడ్డా అని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ డకౌట్ అవుతుందని, పోయిన సారి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఒక్క సీటు గెలిచిందని, ఈసారి అది కూడా రాదన్నారు. ప్రపంచంలో లేని కమిటీలన్నీ తెలంగాణ బీజేపీ వేస్తుందని.. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ కూడా ఒకటి వేసుకుంటే ఆ పార్టీకి మేలు అని సెటైర్లు పేల్చారు. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయయని, ఈసారి డిపాజిట్లయినా దక్కించుకునే ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు మంత్రి హరీష్.
హంగ్ కాదు, హ్యాట్రిక్..
తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని బీజేపీ నేత బీఎల్ సంతోష్ చెబుతున్నారని.. హంగ్, రింగ్ కాదని బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది చూడాలన్నారు హరీష్ రావు. బీఎల్ సంతోష్ కర్నాటకలో బీజేపీని భ్రష్టు పట్టించారని, ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టించేందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. గుజరాత్ లో మీరు మూడు నాలుగు సార్లు గెలవొచ్చు కానీ, మా కేసీఆర్ తెలంగాణలో మూడు సార్లు గెలవొద్దా? అని ప్రశ్నించారు. గుజరాత్ పాలనకంటే తెలంగాణ పాలన నూరుపాళ్లు నయం అని చెప్పారు హరీష్ రావు.