Telugu Global
Telangana

కాంగ్రెస్ వి ప్రజలను ఉద్ధరించే మాటలు కావు.. ఉద్దెర మాటలు

సొల్లు మాటలు తప్ప కాంగ్రెస్ లీడర్లు ఒక్క మంచి మాట కూడా చెప్పడంలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాదని, హామీలు అమలు చేయట్లేదని విమర్శించారు.

కాంగ్రెస్ వి ప్రజలను ఉద్ధరించే మాటలు కావు.. ఉద్దెర మాటలు
X

కాంగ్రెస్ వి ప్రజలను ఉద్ధరించే మాటలు కావని, వారివి ఉద్దెర మాటలని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, రూ.4 వేల పెన్షన్ ఊసే లేదని విమర్శించారు. నిరుద్యోగభృతి ఎప్పుడిస్తారని సూటిగా ప్రశ్నించారు. మాట తప్పిన రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు చురుకుపెడతారని చెప్పారు హరీష్ రావు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో వినోద్ కుమార్ కి మద్దతుగా హరీష్ ర్యాలీ నిర్వహించారు.


అన్నీ సొల్లు మాటలు..

సొల్లు మాటలు తప్ప కాంగ్రెస్ లీడర్లు ఒక్క మంచి మాట కూడా చెప్పడంలేదన్నారు హరీష్ రావు. కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాదని, హామీలు అమలు చేయట్లేదని విమర్శించారు. కేసీఆర్ రైతులకోసం ప్రశ్నిస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ జై తెలంగాణ అనలేదని, కనీసం అమరవీరుల స్థూపం వద్ద పువ్వులైనా పెట్టి నివాళులర్పించలేదని అన్నారు హరీష్ రావు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, కానీ కుమ్మక్కైంది బీజేపీ, కాంగ్రెస్సేనని చెప్పారు హరీష్ రావు. బడే భాయ్, చోటే భాయ్ ఒక్కటయ్యారని మోదీ-రేవంత్ ని ఉద్దేశించి సెటైర్లు పేల్చారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ ఇంతవరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణం బీజేపీతో లాలూచీయేనని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని, అందుకే చాలా చోట్ల కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలో దింపుతోందన్నారు హరీష్ రావు.

కరీంనగర్ బీఆర్ఎస్‌కు పుట్టినిల్లని.. గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధికి వినోద్ కుమార్ కృషి చేశారని చెప్పారు హరీష్ రావు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌ కు రైల్వే లైన్ మంజూరైందని, వినోదన్న జాతీయ రహదారి సాధించారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్లే బండి సంజయ్ ఎంపీగా గెలిచారని, కానీ ఆయన కరీంనగర్ కు చేసిందేమీ లేదని చెప్పారు. బీజేపీవాళ్లు ఇంటికో క్యాలెండర్, ఫొటోలు పంచుతున్నారని అవి కడుపు నింపుతాయా అని ప్రశ్నించారు. ఈసారి కరీంనగర్ లో బీఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు హరీష్ రావు.

First Published:  13 April 2024 8:47 AM IST
Next Story