Telugu Global
Telangana

ఆ కేటగిరీలో రేవంత్ కి ఆస్కార్.. హరీష్ సెటైర్లు

కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతులు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరిగినా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఇప్పటి వరకు ఒక్క బాధిత కుటుంబాన్నైనా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారా? అని ప్రశ్నించారు హరీష్ రావు.

ఆ కేటగిరీలో రేవంత్ కి ఆస్కార్.. హరీష్ సెటైర్లు
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి పదేపదే చెబుతున్నారని.. ఎమ్మెల్యేలను కొనవచ్చేమో కానీ, తమ ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన కొనుగోలు చేయలేరని అన్నారు హరీష్ రావు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్‌రెడ్డి, మళ్లీ మల్కాజ్ గిరిలో పోటీచేశారని ఎద్దేవా చేశారు. మెదక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను కూడా అడ్డుకున్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీష్. ఇందిరాగాంధీ హయాంలో మెదక్‌ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కేసీఆర్ హయాంలో ఆ హామీ నెరవేర్చామని వివరించారు. మూడు జిల్లాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు మంజూరు చేశామన్నారు హరీష్ రావు.

తెలంగాణలో ముఖ్యమంత్రికి, మంత్రులకు అహంకారం తలకెక్కిందని, దానిని నేలమీదకు దించాలంటే మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలని అన్నారు హరీష్ రావు. 100 రోజులలోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసినందుకు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని ఓడిస్తేనే రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. తన ఎత్తు గురించి మాట్లాడడం కంటే ముందు, రైతుల తిప్పల గురించి ఆలోచించాలని రేవంత్ రెడ్డికి సూచించారు హరీష్ రావు.

కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతులు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరిగినా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఇప్పటి వరకు ఒక్క బాధిత కుటుంబాన్నైనా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారా? అని ప్రశ్నించారు హరీష్ రావు. అబద్ధాలాడేందుకు మాత్రం ఆయన సమయం కేటాయిస్తారని, రైతులను కలిసేందుకు సమయం లభించదా? అని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో బీహెచ్‌ఈఎల్‌, ఇక్రిశాట్‌ పరిశ్రమలు వచ్చాయని మెదక్‌ సభలో రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారన్నారు హరీష్ రావు. బీహెచ్‌ఈఎల్‌ 1952లో ఏర్పాటైతే, ఇందిరాగాంధీ 1980లో మెదక్‌ ఎంపీగా గెలిచారన్నారు. ఇక్రిశాట్‌కు నాడు ప్రధాని చరణ్‌సింగ్‌ శంకుస్థాపన చేశారని వివరించారు. అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్‌ అవార్డు ఇస్తే అది రేవంత్‌రెడ్డికే వస్తుందన్నారు హరీష్.

First Published:  22 April 2024 9:38 AM IST
Next Story