రైతుబంధుపై కాంగ్రెస్ కుట్ర - హరీష్ రావు
రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రైతుబంధు బిచ్చం అంటూ రేవంత్ రెడ్డి ఎగతాళి చేశారన్నారు హరీష్ రావు. ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
వ్యవసాయం దండగ అన్న నాయకుడికి వారసుడు రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంపై మాట్లాడుతూ.. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. అక్టోబర్ 23నే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ ఠాక్రే ఈసీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. రైతులపై ప్రేమ ఉంటే ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఇదే విషయాన్ని స్పష్టంచేశారని గుర్తుచేశారు. ఇక తాజాగా ఈసీ రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ మరోసారి ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రైతుబంధు బిచ్చం అంటూ రేవంత్ రెడ్డి ఎగతాళి చేశారన్నారు హరీష్ రావు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.4 వేలు రైతుబంధు ఇచ్చేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ రైతుబంధును నిలిపివేసిందన్నారు. అదే తరహాలో తెలంగాణలో కుట్రలకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్లు రాసిస్తున్నారని.. అవి చిత్తుపేపర్లతో సమానమంటూ మండిపడ్డారు హరీష్ రావు.
గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టం అంతా ఇంతా కాదన్నారు హరీష్ రావు. ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర ఆ పార్టీదేనన్నారు. దొంగ రాత్రి కరెంటు.. నకిలీ విత్తనాలతో రైతుల ఉసురుపోసుకున్నది కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డిసెంబర్ 3న 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్న హరీష్ రావు.. డిసెంబర్ 6న రైతుబంధు నిధులు విడుదల చేస్తామన్నారు.