రేవంత్, భట్టి.. అబద్ధాల్లో పోటీ.. హరీష్ రావు ట్వీట్
అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకరికొకరు పోటీ పడుతున్నారన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ నాయకులు పోటీ పడి మరీ అబద్ధాలు చెప్తున్నారంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్‌లో అబద్ధాల పోటీ నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు.. నూరు అబద్ధాలతో సమానమని మరోసారి నిరూపితమైందని ట్వీట్ చేశారు హరీష్.
అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకరికొకరు పోటీ పడుతున్నారన్నారు హరీష్ రావు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు సభలో ప్రకటించి అభాసుపాలైన భట్టి విక్రమార్క.. తాజాగా రుణమాఫీపైనా నాలుక మడతబెట్టారని విమర్శించారు హరీష్ రావు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను వంచించడమేనన్నారు హరీష్ రావు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పడమే కాకుండా.. సీఎం హోదాలో మొదటి సంతకం రుణమాఫీపైనే అని చెప్పిన విషయం భట్టి తెలియనట్టు నటించడం హాస్యాస్పదమన్నారు హరీష్.
ఏరు దాటే దాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందన్నారు హరీష్ రావు. ఎన్నికల ముందు హామీల వర్షం గుప్పించిన కాంగ్రెస్.. అయిపోయాక మొండి చేయి చూపిస్తోందన్నారు హరీష్ రావు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెప్తారంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు గతంలో రేవంత్ మాట్లాడిన వీడియోలను జత చేశారు.