కాళేశ్వరంపై కేంద్రం చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే : మంత్రి హరీశ్ రావు
రాజకీయ కక్ష తోనే తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదని.. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి రెండు ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కట్టబెట్టారని హరీశ్ రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్రం చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై కేంద్రం పార్లమెంటులో చేసిన ప్రకటనపై మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సాక్ష్యాలతో సహా ట్విట్టర్‌లో పెట్టి ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. రాజకీయ కక్ష తోనే తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదని.. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి రెండు ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కట్టబెట్టారని తెలిపారు. జాతీయ హోదా విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపిస్తోందో ఆధారాలతో సహా ఆయన పలు ట్వీట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.
జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌తోపాటు నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న తాను ఎన్నోసార్లు ప్రధాని నరేంద్ర మోడీ, జలశక్తి మంత్రికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. ఈ విషయాలను దాచి చెప్పి పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభనే కాకుండా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించేదిగా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చెప్పినట్లుగా సీడబ్ల్యూసీ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చింది. కేంద్ర జలశక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్.. ప్రధానికి విజ్ఞప్తి చేశారని.. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్ రావు అన్నారు. 2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంపై పార్లమెంటులో ప్రశ్నించారని.. అయితే నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్‌లో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారని మంత్రి చెప్పారు.
కాగా, కేంద్ర మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనకు విరుద్దంగా.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్‌లోని కెన్-బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రతిపాదనలను మాత్రం పక్కన పెట్టి.. తమ పాలనలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం జాతీయ హోదాను ఇచ్చిందని.. ఇది కేంద్రం తెలంగాణపై చూపిస్తున్న రాజకీయ వివక్షకు నిదర్శనం అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
కేడబ్ల్యూటీడీ-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చింది. న్యాయ విచారణ పూర్తి కాకముందే ఏకంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించింది. అయితే, అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం ఎలాంటి హోదా కట్టబెట్టలేదని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కనీసం పట్టించుకోలేదని.. ఇది రాజకీయ కక్ష కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు.
As quoted by BJP Minister Shri @Bishweswar_Tudu ji on the floor of parliament is blatant lie and misleading the house and the people as well.
— Harish Rao Thanneeru (@BRSHarish) March 17, 2023
Kaleshwaram project has accorded all Clearances from CWC and also got approval from Technical advisory committee of Ministry of Jal… https://t.co/7lENEJivZr pic.twitter.com/ONgjBW5pS8
CWC accorded approval to the Upper Bhadra Project of Karnataka, a BJP ruled State when KWDT II award was stayed by SC in 2013. CWC accorded clearances to Upper Bhadra Project and GoI also accorded NP status for a project when the whole matter was subjudice
— Harish Rao Thanneeru (@BRSHarish) March 17, 2023
For Kaleshwaram… https://t.co/ZqSs2Ke5TY pic.twitter.com/yMhWsVWaV1