Telugu Global
Telangana

అసెంబ్లీలో అబద్ధాలు.. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ధ్వజం

అసత్యాలు, అర్థ సత్యాలతో.. అసెంబ్లీ, గవర్నర్ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు హరీష్ రావు.

అసెంబ్లీలో అబద్ధాలు.. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ధ్వజం
X

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గవర్నర్ తో అసత్యాలు చెప్పించిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని చెప్పారు. మేనిఫెస్టో అంశాల గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదన్నారాయన. అసత్యాలు, అర్థ సత్యాలతో అసెంబ్లీ, గవర్నర్ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు హరీష్ రావు.


మాట తప్పిన సీఎం..

ప్రజావాణిలో రోజూ విజ్ఞప్తులు స్వీకరిస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి, ఒక్క రోజు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రస్తుతం పొరుగు సేవల సిబ్బంది దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్లు దరఖాస్తులు తీసుకునేవారని.. ప్రజావాణి అనే పేరు చెప్పి కాంగ్రెస్ డ్రామాలాడిందని విమర్శించారు. మూసీ నది ప్రక్షాళన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు హరీష్ రావు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 7వ తేదీ వచ్చినా జీతాలివ్వలేకపోతోందని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

60రోజులు పూర్తయ్యాయి..

ఆరు గ్యారెంటీల అమలుకి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన 100 రోజుల గడువులో 60 రోజులు పూర్తయ్యాయని గుర్తు చేశారు హరీష్ రావు. ఇంకా 40 రోజులే మిగిలి ఉన్నాయని, మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తుంది కాబట్టి.. అప్పటివరకు సాగదీసి హామీల అమలు వాయిదా వేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు హరీష్. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చేవారని అన్నారు. రూ.500కి గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ గురించి మాత్రమే గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన ఉందని, అంటే మిగతా హామీలు వచ్చే ఏడాదిలోగా అమలు కావని అర్థం చేసుకోవాలన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు హరీష్ రావు.

First Published:  8 Feb 2024 5:24 PM IST
Next Story