Telugu Global
Telangana

రేవంత్‌ను శాలువాతో సన్మానిస్తా.. కానీ, కండీషన్ - హరీష్‌ రావు

ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తానన్న రేవంత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానన్నారు హరీష్ రావు. కానీ రేవంత్ తన ఛాలెంజ్‌ను ఇప్పటివరకూ స్వీకరించలేదన్నారు.

రేవంత్‌ను శాలువాతో సన్మానిస్తా.. కానీ, కండీషన్ - హరీష్‌ రావు
X

సీఎం రేవంత్ రెడ్డి మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట రోడ్ షోలో తనపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు హరీష్‌ రావు కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం మెదక్ జిల్లా మాత్రమే అభివృద్ధి చెందిందని ఆరోపణలు చేసిన రేవంత్‌.. ఇప్పుడు మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు.

సిద్దిపేట అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే సిద్ధిపేట అని చెప్పారు హరీష్ రావు. సిద్దిపేటను జిల్లా చేశామని, రైలు, గోదావరి నీళ్లు, మెడికల్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు, ఐటీ హబ్‌ తీసుకువచ్చామన్నారు. సిద్దిపేటకు బీఆర్ఎస్ ఏం చేయలేదో చెప్పాలని రేవంత్‌కు సవాల్‌ విసిరారు. అభివృద్ధి విషయంలో సిద్దిపేట జాతీయ స్థాయిలో అనేక అవార్డులందుకుందని గుర్తు చేశారు. సిద్దిపేట పేరు లేకుండా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులే లేవన్నారు హరీష్‌ రావు.

ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు వస్తానన్న రేవంత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానన్నారు హరీష్ రావు. కానీ రేవంత్ తన ఛాలెంజ్‌ను ఇప్పటివరకూ స్వీకరించలేదన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తానే సిద్దిపేటకు ఆహ్వానించి శాలువా కప్పి రేవంత్‌ను సన్మానిస్తానన్నారు. ఎమ్మెల్యే పదవికి స్వచ్ఛందంగా స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు. అమలు చేయలేకపోతే..రేవంత్‌ రాజీనామా చేసి కొడంగల్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు హరీష్‌. ప్రజలకు మేలు జరగడం కంటే తనకు పదవి ముఖ్యమేం కాదన్నారు హరీష్ రావు.

First Published:  3 May 2024 4:39 PM IST
Next Story