Telugu Global
Telangana

ఈటల అత్యాశ.. రెండుచోట్లా డిపాజిట్ గల్లంతే

కేసీఆర్ పై ఈటల పోటీకి దిగడమే తప్పు అని, హుజూరాబాద్, గజ్వేల్‌ రెండు స్థానాల్లో ఈటలకు డిపాజిట్ గల్లంతవుతుందని అన్నారు హరీష్ రావు. కేసీఆర్‌ కు సరితూగే నాయకుడు రాష్ట్రంలో మరెవరూ లేరని అన్నారు.

ఈటల అత్యాశ.. రెండుచోట్లా డిపాజిట్ గల్లంతే
X

పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే తాము కూడా పెద్దవాళ్లం అవుతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు భ్రమపడుతున్నారని, అందుకే ఈటల రాజేందర్, నర్సిరెడ్డి.. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కి పోటీగా నామినేషన్ వేశారని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌ లో కాంగ్రెస్ అభ్యర్థి పత్తాలేడని సెటైర్లు పేల్చారు. కేసీఆర్ పై ఈటల పోటీకి దిగడమే తప్పు అని, హుజూరాబాద్, గజ్వేల్‌ రెండు స్థానాల్లో ఈటలకు డిపాజిట్ గల్లంతవుతుందని అన్నారు. కేసీఆర్‌ కు సరితూగే నాయకుడు రాష్ట్రంలో మరెవరూ లేరని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గజ్వేల్ లో కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.


మర్కుక్ దశ, దిశ మార్చింది కేసీఆర్ అని అన్నారు హరీష్ రావు. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ చేసింది ఆయనేనని చెప్పారు. నెత్తిమీద గంగమ్మ లాగా కొండపోచమ్మ సాగర్ తెచ్చారని చెప్పారు. రోడ్లు లేక గజ్వేల్ వాసులు నాడు ఎంతో ఇబ్బందిపడేవారని, ఇప్పుడు అన్నిచోట్లా డబుల్ రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప గ్రామాల్లో వారికి ఎలాంటి స్పందన లేదన్నారు హరీష్ రావు.

తెలంగాణ తొలి సీఎంగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న కేసీఆర్, దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని అన్నారు మంత్రి హరీష్ రావు. 30 తేదీన అందరూ కారు గుర్తుకు ఓటువేసి గజ్వేల్‌ లో పెద్ద సారు కేసీఆర్ కి తనకంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఒకటీ, రెండు సీట్లతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారన్నారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్, బీఆర్ఎస్ వస్తే 24 కరెంటు ఉంటుందన్నారు హరీష్ రావు.


First Published:  17 Nov 2023 5:03 PM IST
Next Story