Telugu Global
Telangana

పవన్ కల్యాణ్ పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

గతంలో సమైక్య రాష్ట్రానికి మద్దతుగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా మంత్రి హరీష్ రావు, పవన్ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పొత్తు వల్ల బీజేపీకి ఏమాత్రం లాభం ఉంటుందో తెలియదు కానీ నష్టం మాత్రం గ్యారెంటీ అని అంటున్నారు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపికలోనే వ్యవహారం బెడిసింది. జనసేనకు టికెట్లు ఇస్తే అక్కడ తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. జనసేనకు తెలంగాణలో అంత సీన్ లేదని, ఆ పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమస్య అక్కడితో ఆగిపోలేదు. గతంలో సమైక్య రాష్ట్రానికి మద్దతుగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా మంత్రి హరీష్ రావు, పవన్ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రకటన తర్వాత వారం రోజులపాటు తాను భోజనం మానేశానని పవన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు హరీష్ రావు. తెలంగాణ రావడం ఇష్టం లేని పవన్ కల్యాణ్ తో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారాయన. తెలంగాణ ద్రోహులతో పొత్తు పెట్టుకున్న బీజేపీని ఓడించాలా లేదా అని అడిగారు. బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా తెలంగాణ ద్రోహులతోనే పొత్తు పెట్టుకుందని చెప్పారు హరీష్ రావు.

ద్రోహులంతా కలిశారు..

"తెలంగాణ ఇవ్వడం ఇష్టంలేని పవన్ కల్యాణ్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది, తెలంగాణను వెటకారం చేసిన పక్కా సమైక్యవాది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది, పైగా టీడీపీతో లోపాయికారీ మద్దతు తీసుకుంటోంది. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని అనిపిస్తోంది." అని చెప్పారు హరీష్ రావు. ఈ ఎన్నికలు తెలంగాణ సాధకులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహుల్ని ఓడించాలని చెప్పారు.

First Published:  4 Nov 2023 9:09 AM IST
Next Story