చంద్రబాబు అరెస్ట్ పై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు..
పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, ఆయన గురించి మాట్లాడకూడదేమో అంటూనే ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు హరీష్ రావు.
చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ నుంచి పెద్దగా స్పందన లేదు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందన మాత్రం ఏపీలో బాగా హైలైట్ అయింది, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి వైఖరిని రఘునందన్ ఎండగట్టినట్టయింది. అయితే బీఆర్ఎస్ తరపున మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై ఆయన కాస్త సింపతీ చూపించారు. పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, ఆయన గురించి మాట్లాడకూడదేమో అంటూనే ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు హరీష్ రావు.
సిద్ధిపేటలో ఫార్మసీ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. తెలంగాణలో విద్యా, ఉపాధి రంగాల ప్రగతిని వివరించారు. ఐటీ రంగంలో గతంలో ఉన్న ఉద్యోగాలు తెలంగాణ వచ్చాక మూడు రెట్లు పెరిగాయని, ఐటీ ఉత్పత్తుల్లో ఇప్పుడు బెంగళూరుని సైతం హైదరాబాద్ వెనక్కు నెట్టిందన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం లభిస్తోందని వివరించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు హరీష్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ ఐటీ అంటుండేవారని, మిగతా రంగాలను పట్టించుకోలేదని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ సీఎం అయిన తర్వాత హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందిందని, అదే సమయంలో పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి చెందిందని చెప్పారు హరీష్ రావు.
తెలంగాణ నెంబర్-1
ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో తెలంగాణ ఇప్పుడు దేశంలోనే నెంబర్-1 గా ఉందని, ఉద్యోగాల కల్పనలో కూడా తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉందని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఐటీతోపాటు, రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు. పరస్పర ఆధారితంకాని రంగాలను కూడా కేసీఆర్ సమానంగా అభివృద్ధిని చేసి చూపించారన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు హరీష్ రావు.