త్వరలోనే శుభవార్తలు.. మేనిఫెస్టోపై ఆసక్తి పెంచిన హరీష్ రావు
కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడేలా సీఎం కేసీఆర్ శుభవార్తలు చెబుతారని అన్నారాయన.
ఆరు గ్యారెంటీలు అంటూ మేనిఫెస్టోతో కాంగ్రెస్ హడావిడి చేస్తోంది. బీజేపీ కూడా మోదీ సభల్లో గట్టిగానే హామీల వర్షం కురిపించేలా ఉంది. మరి అధికార పార్టీ సంగతేంటి..? బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏముంటాయి..? ఆకట్టుకునే అంశాలేంటి..? ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తి ఉంది. దీన్ని ఈరోజు మరింత పెంచారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే శుభవార్తలు వింటారని నకిరేకల్ సభలో ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడేలా సీఎం కేసీఆర్ శుభవార్తలు చెబుతారని అన్నారాయన. నకిరేకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వ విజయాలను మరోసారి గుర్తు చేశారు. ఇంటింటికి మంచినీళ్లు అందించి, ఆడబిడ్డల కష్టాలు తీర్చింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు హరీష్. గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చేముందు నీళ్ల ట్యాంకర్లు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇంటింటికీ కుళాయిలో మంచినీరు వస్తోందన్నారు. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం కేసీఆర్ పెంచారని చెప్పారు హరీష్ రావు.
కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు.
— Office of Harish Rao (@HarishRaoOffice) September 29, 2023
-మంత్రి హరీశ్ రావు గారు pic.twitter.com/c44OHekWLE
కర్నాటక, ఛత్తీస్ ఘఢ్ లో కాంగ్రెస్ 4వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు హరీష్ రావు. అక్కడ చేతకానిది.. ఇక్కడ ఎలా సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మేసినట్లేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం అని, ఆ విషయాన్ని ప్రజలు మరచిపోయరేమోనని సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కరెంట్ గురించి కాంగ్రెస్ వాళ్లు ఎంత ఎక్కువగా మాట్లాడితే, బీఆర్ఎస్ కి అంత మంచిదన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులు మొక్కుతోందన్నారు హరీష్ రావు. అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని దీవించాలని చెప్పారు.