ఠాణా లోపల హరీశ్ రావు.. గోడ బయట మీడియా
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పోలీసు నిర్బంధం ఏ స్థాయిలో ఉందో హైదరాబాద్ లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సాక్షిగా మరోసారి నిరూపితమైంది. పెండింగ్ బిల్లుల కోసం ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులకు మద్దతునిచ్చేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్ రావు సహా బీఆర్‌ఎస్ నాయకులను తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. సర్పంచులకు మద్దతుగా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు హరీశ్ రావు సిద్ధపడగా పోలీసులు ససేమిరా అన్నారు. మీడియాకు పోలీస్ స్టేషన్ లోకి అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో హరీశ్ రావు ఠాణాలోపలే ఉండి మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ఠాణా ప్రహరి బయట నుంచి ఆయన మాట్లాడుతున్నది కవర్ చేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోన్న రోజుల్లోనూ ఈ స్థాయి నిర్బంధం లేదు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న పదేళ్ల తర్వాత ఇలాంటి నిర్బంధం ఏమిటని మీడియా, ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు హక్కుగా ఇస్తామని చెప్పి అన్నింటికీ ఎగనామం పెట్టారని అన్నారు. 11 నెలల నుంచి మాజీ సర్పంచులు మొత్తుకుంటున్నారని తెలిపారు. వారిని గల్లా పట్టుకొని డీసీఎంలు ఎక్కించారని, తమ హయాంలో పల్లెలను దేశానికే ఆదర్శంగా మలిచిన సర్పంచులను ఇంతలా అవమానించడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదని రెచ్చగొట్టారని, ఎన్నికల సమయంలో అడ్డగోలుగా మాట్లాడారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సర్పంచుల చేతులకు సంకెళ్లు వేస్తున్నారని అన్నారు. కేంద్రం గ్రామాల కోసం ఇచ్చిన ఉపాధి హామీ నిధులు రూ.1,200 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.300 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ నిధులు రూ.500 కోట్లు డైవర్ట్ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేసి గ్రామాలను అధ్వనంగా మార్చేశారని అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్య పునరుద్దరణతో ఏడో గ్యారంటీని అమలు చేస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పారని.. ఇప్పుడు తెలంగాణ అరెస్టులు, నిర్బంధాలతో అట్టుడుకుతోందన్నారు.
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ మంగళవారం హైదరాబాద్ కు వస్తున్నారని.. ఆయన అశోక్ నగర్ కు వెళ్లి అక్కడ ఆందోళనలో ఉన్న నిరుద్యోగులతో మాట్లాడి వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఎన్నికలకు ముందు సెంట్రల్ లైబ్రరీ మెట్లపై కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో నిరుద్యోగులకు రాహుల్ గాంధీ చెప్పాలని సూచించారు. జీవో 29 రద్దు కోసం డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులతోనూ మాట్లాడాలన్నారు. ఇక్కడి ఆరు గ్యారంటీల ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపైనా పడుతుందన్నారు. తెలంగాణలో సాగుతోన్న అరాచక పాలనపైనా రాహుల్ గాంధీ సమీక్ష చేయాలన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కాదు.. ఆయన తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం మాజీ సర్పంచుల సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు. 11 నెలల్లోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత రేవంత్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రం అప్పుల పాలైంది అని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. రూ.85 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని.. పోలీస్ స్టేషన్ల మెయింటనెన్స్ కు నిధులు ఇవ్వకపోవడంతో బేడీలనే తాళాలుగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు.