Telugu Global
Telangana

కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దు

పెన్షన్ పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు హరీష్ రావు. తులం బంగారం, రుణమాఫీ ఇలా చాలా హామీలు అమలులోకి రాలేదని, ఆ కోపం ప్రజల్లో ఉందని, ఎన్నికల్లో కచ్చితంగా ఆ ప్రభావం కనపడుతుందని చెప్పారు.

కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దు
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కాకముందే అప్పుడే కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పై ప్రజల్లో కోపం ఉందన్నారు, అయితే కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని హెచ్చరించారు. సిద్ధిపేటలో జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ ఓట్ల రూపంలో మార్చుకోవాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


పెన్షన్ పెంపు విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు హరీష్ రావు. తులం బంగారం, రుణమాఫీ ఇలా చాలా హామీలు అమలులోకి రాలేదని, ఆ కోపం ప్రజల్లో ఉందని, ఎన్నికల్లో కచ్చితంగా ఆ ప్రభావం కనపడుతుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే కొత్త సమస్యలు వస్తాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదని విమర్శించారు హరీష్ రావు.

బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ..

బీజేపీ పేదల, తెలంగాణ వ్యతిరేక పార్టీ అని అన్నారు హరీష్ రావు. పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురదచల్లారని, ఇప్పుడు బడే భాయ్ అంటూ మోదీకి దగ్గరయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణలో బీఅర్ఎస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు హరీష్ రావు. బీజేపీని ఓడించే శక్తి బీఆర్ఎస్ కి మాత్రమే ఉందని మైనార్టీలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కి గుణపాఠం చెబితేనే హామీలు త్వరితగతిన అమలవుతాయని, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి మెజార్టీ ఇస్తే మాత్రం హామీల సంగతి మరచిపోవాల్సిందేనని చెప్పారు హరీష్ రావు.

First Published:  12 April 2024 6:55 PM IST
Next Story