ఇది కౌరవుల సభ.. అసెంబ్లీలో హరీష్ రావు హాట్ కామెంట్స్
నిన్న, ఈరోజు సభ జరిగిన తీరు తమ హృదయాలను గాయపరిచిందని అన్నారు హరీష్ రావు. ఇది కౌరవుల సభగా మారిపోయిందని చెప్పారు. అంతిమ విజయం పాండవులదేనన్నారు.
ఎట్టకేలకు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశమిచ్చారు స్పీకర్. అయితే అంతకు ముందు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై చర్చిద్దామని, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడితే బాగుండేదని అన్నారాయన. ఆయన సభకు రాకపోయినా, ఆయన తరపున ఎవరైనా మాట్లాడొచ్చన్నారు. అనంతరం స్పీకర్, బీఆర్ఎస్ సభ్యులకు అవకాశమివ్వడంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడాలో కూడా సీఎం చెప్పడం సరికాదన్నారు. అది సభా సాంప్రదాయం కాదన్నారు. సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత వర్గీకరణపై హరీష్ రావు తన ప్రసంగం మొదలు పెట్టారు. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు హరీష్ రావు.
నిన్న, ఈరోజు సభ జరిగిన తీరు తమ హృదయాలను గాయపరిచిందని అన్నారు హరీష్ రావు. ఇది కౌరవుల సభగా మారిపోయిందని చెప్పారు. అంతిమ విజయం పాండవులదేనన్నారు. మహిళా సభ్యులకు అవమానం జరిగిందని హరీష్ రావు నిన్నటి ఘటనను ప్రస్తావిస్తుండగానే ఆయన మైక్ కట్ చేశారు స్పీకర్. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కి అవకాశమిచ్చారు. దీంతో మరోసారి సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
మహిళా శాసన సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసన తెలియజేస్తున్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే స్పీకర్ మాత్రం వారికి అవకాశమిస్తామని చెప్పారే కానీ, మైక్ ఇవ్వలేదు. చివరకు వర్గీకరణపై మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇచ్చారు.