కాంగ్రెస్ నేతలు కరెంటు తీగలు పట్టుకోండి..
విద్యుత్ విషయంలో కేసీఆర్ ని విమర్శిస్తే.. సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనని అన్నారు మంత్రి హరీష్ రావు. ఈ దేశంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు.
రైతులకిచ్చే కరెంటు సరఫరా సరిగా లేదని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. నేరుగా వెళ్లి కరెంటు తీగలు పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుందని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని.. లాగ్ బుక్కులు, పేపర్లు అంటూ ఏవేవో అంటున్నారని.. వాటన్నిటినీ చూపించే బదులు కరెంటు తీగలు పట్టుకుంటే విద్యుత్ ఉందో లేదో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు.
విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే.. సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనని అన్నారు మంత్రి హరీష్ రావు. ఈ దేశంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్ కూడా వద్దంటున్న కాంగ్రెస్ తన నిజస్వరూపం బయటపెట్టుకుందని మండిపడ్డారు.
రైతుల పట్ల తమ వ్యతిరేక విధానాన్ని బయటపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ : మంత్రి శ్రీ @BRSHarish pic.twitter.com/n3woMv9Jb7
— BRS Party (@BRSparty) July 14, 2023
గతంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో, మరోసారి అధికారంలోకి వస్తే అదే తరహా పాలన తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెప్పకనే చెబుతున్నారని అన్నారు హరీష్ రావు. ఒకరు 3 గంటలు చాలంటున్నారని, మరొకరు 8 గంటలు కావాలంటున్నారని, ఇంకొకరు బోరు బావుల వద్ద మీటర్లు పెడతామంటున్నారని.. వారి మాటలతో రైతుల పట్ల కాంగ్రెస్ విధానం ఏంటో తేలిపోయిందని చెప్పారు.
అంతకంటే జోక్ ఉంటుందా..?
బషీర్ బాగ్ కాల్పులకు సీఎం కేసీఆర్ కారణం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అంతకంటే జోక్ ఉంటుందా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన కారణాలలో విద్యుత్ కూడా ఒకటని చెప్పారు. చంద్రబాబు విద్యుత్ బిల్లులు పెంచితే, ప్రభుత్వంలో ఉండి కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు హరీష్ రావు. డిప్యూటీ స్పీకర్. కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచలా వదిలేసిన నేత కేసీఆర్ అని గుర్తు చేశారు. పదవుల కోసం చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారేవారు మీరేనంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.