ఓపిక లేకపోతే ఎలా..? బురదజల్లడమే మీ పనా..?
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో సమావేశం ముగిసిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారాయన. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని, కానీ మంత్రి మాత్రం సంతకాలు పెట్టలేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నారు హరీష్ రావు. గతంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు. పార్లమెంటు గట్టిగా గొంతు వినిపిస్తామని చెప్పారు హరీష్.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి కేసీఅర్ నివాసం లో ముగిసిన బి అర్ ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం.
— Office of Harish Rao (@HarishRaoOffice) January 26, 2024
మీడియా తో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు గారు.
మంత్రి హరీష్రావు గారి కామెంట్స్ :
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘ చర్చ జరిగింది
కృష్ణా రివర్ బోర్డుకు… pic.twitter.com/w0kxpiWQEN
సహనం కోల్పోతే ఎలా..?
ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఉచ్చ ఆగడం లేదని ఒకరు, చెప్పుతో కొడతామని మరొకరు అంటున్నారని, అసలు అదేం భాష అని ప్రశ్నించారు. ఇలాంటి భాష మాట్లాడేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ నాయకులకు తొందర ఎక్కువైందని, కేవలం బీఆర్ఎస్ పై బురదజల్లడమే వారి పని అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయని, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలకు ఓపిక ఉందని, ప్రజల కోసమే తాము ప్రశ్నిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఎన్నికలకు ముందు హామీలిచ్చి, ఇప్పుడు అసహనం వ్యక్తం చేయడమేంటని అడిగారు. మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుందని, ఆలోపు ఎన్నికల కోడ్ వస్తుందని, అందుకే వారు హామీల అమలుకి 100 రోజుల డెడ్ లైన్ పెట్టారని విమర్శించారు హరీష్ రావు.