Telugu Global
Telangana

రేవంత్ ఒట్లు.. హరీష్‌ రావు మొక్కులు

రుణమాఫీపై ముఖ్యమంత్రి ఓ మాట, మంత్రులు ఓ మాట చెప్తున్నారన్నారు. ఎవరి మాట నిజమో తెలియక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు హరీష్ రావు.

రేవంత్ ఒట్లు.. హరీష్‌ రావు మొక్కులు
X

రైతు రుణమాఫీ విషయంలో మాజీ మంత్రి హరీష్‌ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి చూపిస్తానంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ కాకపోవడంతో హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టిన దేవుళ్ల దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా రేపు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటానని ప్రకటించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేస్తానని స్పష్టం చేశారు. పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించి, తెలంగాణ ప్రజలపై దయ ఉంచాలని దేవున్ని కోరుకుంటానన్నారు. ముఖ్యమంత్రి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా రక్షించాలని స్వామిని ప్రార్థిస్తానన్నారు హరీష్ రావు.


రూ.49 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కడుపు కట్టుకుంటే ఏడాదిలోనే రూ.40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో చెప్పాడని గుర్తు చేశారు హరీష్ రావు. తర్వాత కేబినెట్‌లో రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తానని నిర్ణయించి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెట్టారన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో రుణమాఫీ నిధులను రూ.26 వేల కోట్లకు కుదించారని, ఆగస్టు 15 నాడు రూ. 17 వేల కోట్లతో రుణమాఫీ చేశామని ప్రకటించారని ఆరోపించారు హరీష్ రావు.

రుణమాఫీపై ముఖ్యమంత్రి ఓ మాట, మంత్రులు ఓ మాట చెప్తున్నారన్నారు. ఎవరి మాట నిజమో తెలియక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు హరీష్ రావు. అగ్రికల్చర్ ఆఫీసులు, బ్యాంకులు, కలెక్టరేట్ల చుట్టూ రైతులు చెప్పులరిగేలా తిరుగుతున్నారని, రేపు ఆలేరులో నిర్వహించే ధర్నాలో తాను పాల్గొంటానని చెప్పారు.

First Published:  21 Aug 2024 12:55 PM GMT
Next Story