Telugu Global
Telangana

ఉచితాలు వద్దంటారా? బీజేపీని పాతరేయండి: హరీశ్‌రావు

రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇటువంటి పథకాలు ఏవీ ఉండవని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు.

ఉచితాలు వద్దంటారా? బీజేపీని పాతరేయండి: హరీశ్‌రావు
X

'బీజేపీ లాంటి పార్టీకి ప్రజలు పాతరెయ్యాలి. ఉచిత పథకాలు ఇవ్వ‌కూడ‌దు అనేది ఆ పార్టీ విధానం. అటువంటి పార్టీలు మనకు అవసరమా.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి కింద రూ. లక్ష ఇస్తున్నారా?. బీజేపీ లాంటి పార్టీలు తెలంగాణలో పవర్‌లోకి వస్తే ఇటువంటి పథకాలు ఉండవు' అని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో శుక్రవారం నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 75 రూపాయల పింఛన్ మాత్రమే ఉండేదని.. అది కూడా చాలా తక్కువ మందికి ఉండేదని గుర్తుచేశారు. ఎవరైనా చనిపోతేనే.. కొత్తగా లబ్ధిదారులను చేర్చేవారని గుర్తుచేశారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పింఛన్ రూ. 200 పెంచిందని అయినప్పటికీ ఒంటరి మహిళలకు, గౌడన్నలకు, చేనేతలకు పింఛన్ అందేది కాదన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్ ఎన్నో రెట్లు పెంచి రూ. 2000 ఇస్తోందని గుర్తు చేశారు. పింఛన్ మాత్రమే కాకుండా.. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇటువంటి పథకాలు ఏవీ ఉండవని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. పెన్షన్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అర్హులైన ప్రతి పేదవాడికి అందజేస్తామని హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ పాలనలో మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలకు భరోసా లభిస్తోందని, కన్న కొడుకు చీర కొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నారని గుర్తుచేశారు. ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం మీ అందరి అదృష్టమని.. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పారు. ఢిల్లీలో కూర్చున్నవారు కాళేశ్వరం మీద విమర్శలు చేస్తున్నారని వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

First Published:  2 Sept 2022 1:16 PM IST
Next Story