Telugu Global
Telangana

తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్.. రేవంత్ పై మండిపడ్డ హరీష్

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని నిలదీశారు హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం భ్రమ అని అన్నారు.

తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్.. రేవంత్ పై మండిపడ్డ హరీష్
X

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఏపీలో కలిపింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టుకు ముగ్గు పోసింది కూడా కాంగ్రెస్సేనన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతోందని, ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, భూ సేకరణ జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ తెలంగాణ ఖ్యాతిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ప్రజలు కళ్లకు అద్దుకుని గెలిపిస్తారన్నారు హరీష్ రావు.

పిచ్చోడి చేతిలో రాయి..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. జహీరాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలని ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ సంఘం నేతలు బీఆర్ఎస్ లో చేరడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారాయన. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకి రేవంత్‌ రెడ్డి అసలైన వారసుడిగా మారారని సెటైర్లు వేశారు. రేవంత్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఉత్త కరెంటు అనలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు బాగుందా? బీఆర్ఎస్ పాలనలో కరెంటు బాగుందా? అనే విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ కి అంత లాభం అన్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని నిలదీశారు హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం భ్రమ అని అన్నారు. వస్తే రైతులకు 24గంటలు కరెంటు ఇవ్వబోమని వారే చెబుతున్నారని, అలాంటి వారికి ప్రజలు అధికారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

First Published:  16 July 2023 9:51 PM IST
Next Story